Govt. Teacher Suicide: హైదరాబాద్ మహానగర శివారులో విషాదం చోటుచేసుకుంది. భార్య లేని సమయంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి కాలనీలో ఈ ఘటన జరిగింది. శ్రీసాయి కాలనీలోని ఓ అపార్టుమెంటులో నివాసముంటున్న చంద్రశేఖర్(47) పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చింతల్, శ్రీసాయి కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భార్యాభర్తల గొడవలే చంద్రశేఖర్ మరణానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. భార్య శ్రీలత అబిడ్స్ లోని గ్రామర్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లో భార్యా, పిల్లలు లేని సమయంలో చంద్రశేఖర్ బెడ్ రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం భార్య శ్రీలత ఇంటికి వచ్చి చూడగా భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సివుంది.