పిడిగుద్దులు మాదిరి కత్తిపోట్లు.. ఉన్మాది అకౌంట్లను గతంలోనే బ్లాక్ చేసిన రమ్య.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఘటన

పిడిగుద్దులు మాదిరి కత్తిపోట్లు.. ఉన్మాది అకౌంట్లను గతంలోనే బ్లాక్ చేసిన రమ్య.. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఘటన
Ramya Murder

ఉన్మాది శివకృష్ణ చేతిలో బలైన బీటెక్‌ స్టూడెంట్‌.. పేరు రమ్య. శివకృష్ణ-రమ్య మధ్య ఏం జరిగిందో తెలీదు.. రెప్పపాటులో రమ్యపై కత్తి దూశాడు శివకృష్ణ.

Ram Naramaneni

|

Aug 16, 2021 | 2:48 PM

గుంటారు జిల్లాలో జరిగిన బీటెక్ విద్యార్థిని హత్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. ఉన్మాది శివకృష్ణ చేతిలో బలైన బీటెక్‌ స్టూడెంట్‌.. పేరు రమ్య. శివకృష్ణ-రమ్య మధ్య ఏం జరిగిందో తెలీదు.. రెప్పపాటులో రమ్యపై కత్తి దూశాడు శివకృష్ణ. అందరూ చూస్తుండగానే పొడిచి నిమిషాల వ్యవధిలో పరారయ్యాడు.పంద్రాగస్టు వేళ గుండెలు మండే దారుణం ఇది. క్షణికావేశమో.. కోపమో తెలియదు. యువకుడి దుర్మార్గం కన్నవాళ్లను కడుపుకోతకు గురిచేసింది.. కనిపెంచిన బిడ్డను రక్తపు మడుగులో చూసి పేరెంట్స్‌ గుండెలు పగిలిపోయాయి. బీటెక్‌ స్టూడెంట్‌ మర్డర్‌ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది.

ఉన్మాది ఘాతుకానికి మరో విద్యాకుసుమం బలైంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సర్వత్రా సంచలనం రేకెత్తిస్తోంది. ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ థర్డ్ ఇయర్ చదువుతున్న రమ్య హత్య పంద్రాగస్టు రోజున తీవ్ర విషాదాన్ని నింపింది. కాకాణి రోడ్డు వెంట వెళ్తున్న రమ్య మర్డర్‌ మిస్టరీని తలపిస్తోంది. ఒక్కసారి ఘటన జరిగిన తీరును పరిశీలిస్తే.. అదే రోడ్డుపై వెళ్తున్న శశికృష్ణ తన బైక్‌పై ఎక్కాలని కోరాడు. అందుకు రమ్య నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. సహనం కోల్పోయి వెంట తెచ్చుకున్న కత్తితో రమ్య మెడ, పొట్ట భాగంలో విచక్షణారహితంగా పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రక్తమోడుతున్న యువతిని స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి రమ్య చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

వదిలెయ్.. అంటూ వేడుకుంటున్నా శశికృష్ణ మనసు కరగలేదు. కత్తితో విరుచుకుపడ్డాడు. పిడిగుద్దుల మాదిరి కత్తితో పోట్లు పొడిచాడు. ప్రాణాలు పోయేలా పొడిచి పారిపోయాడు దుర్మార్గుడు. గుంటూరులోని కాకానిరోడ్డులో జరిగిన ఈ హత్యాకాండ తీవ్ర కలకలం రేపింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు చూస్తే.. ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్యను చంపాలని డిసైడయి.. అతను వచ్చినట్టు అనిపిస్తుంది. నడిరోడ్డుపై యువతిని కత్తితో పొడుస్తుంటే.. స్థానికులు కళ్లప్పగించి చూస్తుండిపోయారు. ఉన్మాది పారిపోయాక ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు.

రమ్య ప్రాణాలు తీసిన దుర్మార్గుడు శశికృష్ణను పట్టుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు.. స్థానికులు కీలక సమాచారం అందించారన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్‌. ఆ డీటేల్స్ ఆధారంగా వేట మొదలుపెట్టిన పోలీసులు శశికృష్ణ ఎక్కడున్నాడో కనిపెట్టారు. ఖాకీలు తనను చుట్టుముట్టడంతో.. దొరికిపోతానని గ్రహించిన ఉన్మాది ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడ్ని పట్టుకున్న పోలీసులు.. ట్రీట్‌మెంట్ ఇప్పించి గుంటూరు తరలించారు.

రమ్య మర్డర్‌ కేసు కూపీ లాగుతున్నారు పోలీసులు. రమ్యను చంపాల్సినంత పగ.. అవసరం ఏముందన్న కోణంలో ఆరాతీస్తున్నారు. సరిగ్గా ఉదయం 9.45 నిమిషాల సమయంలో దాడి జరిగినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితుల్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్ని సమగ్రంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. శివకృష్ణ రెండు అకౌంట్లను రమ్య గతంలోనే బ్లాక్‌ చేసింది. సోషల్‌ మీడియా ఖాతాల్ని పరిశీలించాకే ఓ క్లారిటీకి వచ్చారు పోలీసులు. అనుమానంతో ఆరాతీయగా.. శివకృష్ణే నిందితుడిగా తేలిపోయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందంటున్నారు పోలీసులు. రమ్య హత్యను తీవ్రంగా పరిగణించింది ప్రభుత్వం. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని.. పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు సీఎం జగన్. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. జీజీహెచ్‌లో బీటెక్ స్టూడెంట్‌ రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. రమ్య కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామన్నారు. రమ్య మృతదేహాన్ని పరిశీలించారు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ. రమ్య హత్య ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు పద్మ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు రిపీట్‌ అవుతున్నాయన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. శివకృష్ణ ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి కారణం ఏంటి..? చదువుల తల్లి మెడపై ఎందుకు కత్తిగట్టాడన్నది తేలాల్సి ఉంది. నిర్భయలాంటి బలమైన చట్టాలు వచ్చినా ఆడబిడ్డలకు అభయం లేకుండాపోయింది. ఇంటి గడప దాటితే ఎప్పుడు.. ఎవరు.. ఎలా.. దాడి చేస్తారోనన్న ఆందోళన కన్నవాళ్లను కంగారెత్తిస్తోంది.

Also Read: Lokesh arrest: గుంటూరు: పరమయ్యగుంటలో ఉద్రిక్త పరిస్థితులు.. నారా లోకేశ్ అరెస్ట్

 ఎవరి బిడ్డైనా ఒకటే.. నా కొడుకుకి తగిన శాస్తి జరగాల్సిందే.. నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu