Fake Remdesivir : ప్రజల ప్రాణాలతో కక్కుర్తిగాళ్ల చెలగాటం.. నకిలీ రెమ్‌డెసివిర్‌‌తో మృతి.. విచారణలో ఆసక్తికర విషయాలు..!

|

May 19, 2021 | 9:49 PM

ఖమ్మం జిల్లలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా బాధితుడికి నకిలీ ఇంజెక్షన్ ఇస్తూ మోసం చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి బండారం బయటపడింది.

Fake Remdesivir : ప్రజల ప్రాణాలతో కక్కుర్తిగాళ్ల చెలగాటం.. నకిలీ రెమ్‌డెసివిర్‌‌తో మృతి.. విచారణలో ఆసక్తికర విషయాలు..!
Fake Remdesivir
Follow us on

Fake Remdesivir Case Inquiry: ఖమ్మం జిల్లలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కరోనా బాధితుడికి నకిలీ ఇంజెక్షన్ ఇస్తూ మోసం చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి బండారం బయటపడింది. ఓవైపు కరోనా మహమ్మారి విస్తృతస్థాయిలో విరుచుకుపడుతోంది. మరోవైపు, సరైన సమయంలో రోగులను ఆదుకోవాల్సిన వైద్యుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పాజిటివ్‌ అడ్డుపెట్టుకుని పేషంట్లను తీవ్రమైన భయానికి గురిచేస్తున్న ఘటనలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఇలాంటి ఘటన చోటుచేసుకోగా.. జిల్లా అధికార యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి తరుణంలో మరో ప్రైవేట్ ఆసుపత్రి కరోనా వైద్యం పేరిట నకిలీ దందా బయటపడింది.

ఖమ్మం పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి.. రెమిడెసివర్‌ ఇంజెక్షన్‌ పేరిట ఒక్కోదానికి రూ.30 వేలు వసూలు చేయడమే కాకుండా.. రోగికి నకిలీది ఎక్కించారు. అయితే, ఐసీయూలో రోగికి రెమెడెసివర్‌ ఇంజెక్షన్‌ ఇస్తుండగా రోగి కుమారుడు బయట నుంచి సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించడంతో దారుణం వెలుగుచూసింది.వాస్తవానికి హెటిరో కంపెనీ తయారుచేసిన రెమెడిసివర్‌ లిక్విడ్‌ రూపంలో ఉంటుంది.. కానీ ఇక్కడ ఈ ఆసుపత్రిలో రోగికి రెమ్‌డెసివర్ పేరిట ఎక్కించిన మందు మాత్రం పౌడర్‌ రూపంలో ఉండడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదతో విచారణ చేపట్టిన అధికారులకు మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

ఖమ్మం పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ భద్రయ్యకు కరోనా పాజిటివ్‌ రావడంతో గత నెల 24న ఖమ్మంలోని బాలాజీ ఛెస్ట్‌ ఆసుపత్రిలో చేర్చించారు. అతని ఆరోగ్యం విషమించిందని, అత్యవసరంగా రెమెడెసివర్‌ ఇంజెక్షన్లు కావాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా దొరకక పోవడంతో.. ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేయమని కోరగా.. ఒక్కోదానికి రూ.30 వేల చొప్పున రెండు ఇంజెక్షన్లకు రూ.60 వేలు వసూలు చేశారని భద్రయ్య కొడుకు తెలిపాడు.

అయితే, ఈ ఇంజెక్షన్‌ చేసే సందర్భంలో పొడి రూపంలో ఉండడంతో అదేంటి అని అడిగినా ఆసుపత్రి సిబ్బంది సమాధానం ఇవ్వలేదు. మరసటి రోజు మరో రోగికి ఇదే ఇంజెక్షన్‌ ఇస్తుండగా చూశానని భద్రయ్య కొడుకు తెలిపాడు. అది మాత్రం లిక్విడ్‌ రూపంలోనే ఉండడంతో ప్రశ్నించానని.. అయినా సమాధానం చెప్పలేదని మృతుని కుమారుడు సందీప్‌ ఆరోపించారు. ఇలా నకిలీ ఇంజెక్షన్లు చేయడంతో తన తండ్రి ఆరోగ్యం విషమించడంతో.. మరోచోటికి మార్చాలని నిర్దాక్షిణ్యంగా చెప్పారని.. కేవలం వైద్యశాల నిర్లక్ష్యం, కక్కుర్తితోనే తన తండ్రి చనిపోయాడని సందీప్‌ కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కలెక్టర్‌ కర్ణన్‌ విచారణకు ఆదేశించారు.

దీంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం దాకా బాలాజీ ఛెస్ట్‌ ఆసుపత్రిలో ఖమ్మం ఏసీపీ బి.ఆంజనేయులు స్వయంగా విచారణ జరిపారు. మృతుని కుమారుడు తీసిన వీడియోలో ఆసుపత్రి సిబ్బంది సెలైన్‌లో నుంచి సిరంజి ద్వారా కొంత లిక్విడ్‌ను తీసి.. పౌడర్‌ ఉన్న ఒక వాయిల్‌లో ఎక్కించినట్టు క్లియర్‌గా ఉంది. దీంతో రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు ఇప్పటిదాకా ఎన్ని తీసుకున్నారు.. ఎన్ని వినియోగించారు.. ఎన్ని నిల్వ ఉన్నాయన్న దానిపై ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించారు. రోగి కేస్‌ షీట్లను పరిశీలించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రాథమిక ఆధారాల మేరకు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి తనిఖీకి సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని ఏసీపీ అంజనేయులు తెలిపారు.

వాస్తవానికి ఇలా సరఫరా మెరుగుపడక ముందు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాదాపు నాలుగు కేసుల్లో పలువురిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపింది. అయినా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. రోగుల అత్యవసరం, బంధువుల ఆతృతను, భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. కోవిడ్ వైరస్‌కు తోడు ప్రైవేట్ ఆసుపత్రి కక్కర్తితో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Read Also…  Farmers Good News: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్.. డీఏపీ ఎరువుపై సబ్సిడీ 140% పెంపు.. బస్తా ధర రూ. 1,200