విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి హాల్ చల్ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా ఫేక్ ఐడి కార్డులతో అమ్మవారి ఫ్రొటో కాల్ దర్శనం చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు. ఆలయ సిబ్బందికి అనుమానం రావడంతో నిఘా పెట్టిన ఆలయ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఇతగాడి అసలు వ్యవహారం మొత్తం గుట్టురట్టు అయ్యింది.
తనకి తాను ఇన్ కమ్ టాక్స్ డిపార్డ్‌మెంట్‌కు చెందిన అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం ఇప్పించాలని బురిడీ కొట్టించాడు. చివరికి సదరు వ్యక్తిని దుర్గగుడి సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ఆలయానికి వచ్చి వెళ్ళిన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాచవరం ప్రాంతానికి చెందిన భరత్ భూషణ్ అనే వ్యక్తి, తాను ఐఆర్ఎస్ అధికారి అంటూ నమ్మబలికాడు. దుర్గగుడి సిబ్బందికి ఐటీ అధికారిగా పరిచయం చేసుకుని ప్రోటోకాల్ దర్శనం కోసం సంప్రదిస్తూ వచ్చాడు.
అయితే అనుమానం వచ్చిన ఆలయ సిబ్బంది మార్చి 5వ తేదీన అమ్మవారి దర్శనానికి వచ్చిన భరత భూషణ్‌ను ప్రశ్నించి ఐడి కార్డులు చూపించాలని అడిగారు. దీంతో పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఐడి కార్డులను మార్చి మార్చి చూపిస్తున్న విధానంతో అనుమానం వచ్చిన దుర్గగుడి సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌కం టాక్స్ కార్యాలయంలో అటువంటి పేరు గల వ్యక్తి లేరని సమాధానం రావడంతో పోలీసులకు దుర్గగుడి సిబ్బంది అప్పచెప్పారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు భరత్ భూషణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…