Hyderabad Old City Blast: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఛత్రినాక కందికల్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. గాయాలైన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం.. పోలీసులు క్లూస్ టీం బృందానికి కూడా సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాధ్ (30) గా గుర్తించారు. చనిపోయిన వారు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులుగా పోలీసులు పేర్కొన్నారు. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణసంచా తయారీ కారణంగానే ఈ పేలుడు సంభవించిందని.. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. రసాయనాలు కలవడంతో పేలుడు తీవ్రత ఎక్కువైందని.. పోలీసులు వెల్లడించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తి వీరేంద్ర కుమార్‌కు చికిత్స అందుతుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: