Crime Complaint Centers : సైబర్ నేరాల ఫిర్యాదులు ఇప్పుడు మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో చేసేయొచ్చిలా..!

|

Mar 25, 2021 | 6:29 PM

Crime Complaint Centers : సైబర్ కేటుగాళ్లిప్పుడు ప్రతీ చోటకూ వచ్చేస్తున్నారు. పల్లె, పట్నం, నగరం తేడాలేదు. ఫోన్ ఎక్కడకి వెళ్తే అక్కడ ప్లాన్ పక్కా అమలు..

Crime Complaint Centers : సైబర్ నేరాల ఫిర్యాదులు ఇప్పుడు మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో చేసేయొచ్చిలా..!
Cyber Crime
Follow us on

Crime Complaint Centers : సైబర్ కేటుగాళ్లిప్పుడు ప్రతీ చోటకూ వచ్చేస్తున్నారు. పల్లె, పట్నం, నగరం తేడాలేదు. ఫోన్ ఎక్కడకి వెళ్తే అక్కడ ప్లాన్ పక్కా అమలు చేసేస్తున్నారు. అమాయకుల్ని బురిడీ కొట్టించి సొమ్ములు క్షణాల్లో లాగేసుకుని పత్తా లేకుండా పోతున్నారు. తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక, కొందరు తామలో తాము బాధపడుతూ మౌనంగానే కుమిలిపోతున్నారు. అయితే, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైబర్ నేరాల బాధితులకు అండదండలు అందించేందుకు సేవల్ని అక్కరకు తెచ్చారు.

సైబర్ ఫిర్యాదులు ఇచ్చేందుకు వీలుగా సైబరాబాద్‌ పరిధిలో ఉన్న 44 శాంతి భద్రతల పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేక సైబర్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ సౌకర్యాల్ని పరిమిత పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులను నమోదు చేసుకోవడం ఈ సైబర్ సెల్ విధి. దీంతో ఇకపై సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు గచ్చిబౌలి రావాల్సిన అవసరం లేదు. షాద్‌నగర్‌, రాంచంద్రపురం, మేడ్చల్‌, శామీర్‌పేట్‌ వరకు విస్తరించి ఉన్న పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని బాధితులు దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోవచ్చు.

ఇక నుంచి స్థానిక పీఎస్‌లో సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు కేసు తాజా స్థితిని బాధితుడు తెలుసుకునే విధంగా సైబర్‌ సెల్‌ అందుబాటులో ఉంటుందన్నారు సీపీ సజ్జనార్. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సైబర్‌ నేరాలు పెరుగుతున్నందున పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రతి ఠాణాకు సైబర్‌ సెల్‌ కార్యక్రమాన్ని చేపట్టామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు.

Read also : Kurnool’s Orvakal Airport : ఏపీ న్యాయ రాజధానిలో ఎయిర్ పోర్ట్ ప్రారంభం, ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పేరును ప్ర‌క‌టించిన సీఎం