కట్టుకున్న వాడి మీద కోపంతో కన్నబిడ్డలను బలి తీసుకుంది ఓ కన్న తల్లి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఒకేసారి ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి దారుణంగా హతమార్చింది. అమ్మ ప్రేమకు తలవొంపులు తెచ్చేలా కన్న బిడ్డల్ని కర్కశంగా హతమార్చిన ఆ తల్లికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అదేవిధంగా 15 ఏళ్ల పాటు పెరోల్‌కు అనర్హురాలిగా తీర్పు వెలువరించింది. జర్మనీలోని బెర్లిన్ నగరంలోని సోలింగెన్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల క్రిస్టియానే గతేడాది సెప్టెంబర్‌లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని హత్య చేసింది. మృతుల్లో ఒక సంవత్సరం, రెండు, మూడే ఏళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఆరు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.
బ్రేక్‌ఫాస్ట్‌లో క్లోరోఫామ్ కలిపి..
పిల్లలు తినే బ్రేక్‌ఫాస్ట్‌లో క్లోరోఫామ్ కలిపిన క్రిస్టియానే వారు స్పృహ తప్పిన తర్వాత హత్య చేసింది. అనంతరం మృతదేహాలను వస్త్రంలో చుట్టి బెడ్‌పై పెట్టింది. ఈ హత్యలు జరిగే సమయంలో 11 ఏళ్ల మరో కుమారుడు పాఠశాలలో ఉండడంతో ప్రాణాలు దక్కించుకోగలిగాడు. పిల్లల్ని హత్య చేసిన అనంతరం క్రిస్టియానే కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెలిశాయి. ఆమె తన పిల్లలను హతమార్చిందని తెలిసి షాక్ అయ్యారు. వెంటనే క్రిస్టియానే ఇంటికి వెళ్లి పరిశీలించగా.. బెడ్‌పై 5గురు పిల్లలు విగతజీవులుగా కనిపించారు.
భర్తపై కోపంతోనే ఈ హత్యలు..
క్రిస్టియానేకు మానసిక స్థితి సరిగా లేదని అందుకే కన్నబిడ్డలను కర్కశంగా చంపేసిందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ‘ఆరుగురు బిడ్డలకు తల్లి అయిన తర్వాత క్రిస్టియానేను భర్త విడిచిపెట్టాడు. మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ కోపంలోనే విచక్షణ మర్చిపోయి పిల్లల్ని హతమార్చింది. ఈ సంఘటనకు ముందు భర్తతో ‘నువ్వు మన పిల్లల్ని ఇంకెప్పుడూ చూడలేవ్’ అని ఆమె చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం. ఇక హత్యకు ముందు పిల్లల ఆల్పాహారంలో క్లోరోఫామ్ కలిపి ఇచ్చింది. అందుకే ఇంత జరుగుతున్నా పిల్లలు ప్రతిఘటించలేకపోయారు’ అని లాయర్లు కోర్టుకు నివేదించారు. మరోవైపు తాను నిర్దోషినని, ఒక దుండగుడు ముసుగు వేసుకుని వచ్చి తన పిల్లలను హత్య చేశాడని క్రిస్టియానే కోర్టుకు తెలిపింది. అయితే విచారణలో ఆమె చెప్పినవన్నీ అబద్ధమని తేలడంతో న్యాయస్థానం ఆమెకు జీవితఖైదు విధించింది.
Also Read:
Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..
Online deposits scams: ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నారా.. అయితే ఒకసారి ఇది చదవండి..
సభ్యసమాజం తలదించుకునే ఘటన.. 9వ తరగతి బాలికపై తండ్రీకొడుకులు అత్యాచారం