Covid Patient Suicide : తిరుపతి శ్రీ పద్మావతి స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. 50 ఏళ్ల కృష్ణయ్య అనే వ్యక్తి ఆస్పత్రి పైనుంచి దూకాడు. మృతుడు చంద్రగిరి మండలం నరసింగాపురం వాసిగా గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. సరైన వైద్యం అందకే రోగులు మృతి చెందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాటర్, సరైన ఆహారం కూడా అందలేదని రోగులు తమ బంధువులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
పేషెంట్లకు లోపలికి ఏదైనా పంపించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ వారిని చూడ్డానికి కూడా లోపలికి పంపించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల విశాఖలో ఆసుపత్రి భవనం పై నుంచి ఒకరు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే తిరుపతిలో అదే మాదిరి ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.