Covid-19 infected man suicide attempt: దేశమంతటా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సోకిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలోని రంగానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ నారాయణకు కరోనా సోకడంతో జ్వరం వస్తోంది. ఈ క్రమంలో తీవ్రమైన జ్వరాన్ని తట్టుకోలేకపోయిన నారాయణ మనస్థాపంతో కత్తితో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
నారాయణ గతంలో కంచికచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 30 సంవత్సరాలు గుమస్తాగా, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. 18 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొంది ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉంటున్నాడు. అయితే.. ఈ ఘటనపై నారాయణ కుమారుడు వీరబాబు మాట్లాడుతూ… ఇతర కారణాలు ఏమీ లేవని కరోనా సోకిందన్న మనస్తాపంతోనే తన తండ్ర ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. ఈ ఘటన అనంతరం కంచికచర్ల ఎస్‌ఐ జి.లక్ష్మి రాంగానగర్‌కు చేరుకోని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.