ఏపీలో సంచలనం సృష్టిస్తున్న సీఐడీ సోదాలు, ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..

|

Apr 12, 2021 | 12:18 PM

AP CID : తెలంగాణలో ఈఎస్‌ఐ స్కామ్‌లో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతుంటే, అటు ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ సోదాలతో ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా..

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న సీఐడీ సోదాలు, ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
Osmania Hospital
Follow us on

AP CID : తెలంగాణలో ఈఎస్‌ఐ స్కామ్‌లో ఈడీ సోదాలు ప్రకంపనలు రేపుతుంటే, అటు ఆంధ్రప్రదేశ్ లో సీఐడీ సోదాలతో ఏపీ ప్రభుత్వాస్పత్రుల్లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వెరసి.. తీగ లాగితే డొంక కదులుతోంది. మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణ పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలు వెలుగు చూస్తుండటం ఇప్పుడు కాక రేపుతోంది. అప్పట్లో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్యతో పాటు.. ఏపీఎస్‌ఎంఐడీసీ ఎండీగా పనిచేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు గోపీనాథ్‌ పేర్లు ఉండటం రాజకీయంగా మరింత హీట్‌ పెంచుతోంది.

కాగా, 2015 నుంచి జరిగిన ప్రాజెక్ట్‌ టెండర్లలో అక్రమాలు జరిగాయని.. కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు కోట్లాది రూపాయలు తినేశారని గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదులొచ్చాయి. ఐతే అప్పటి ప్రభుత్వం వాటిని లైట్‌ తీసుకోవడంతో హైకోర్టును ఆశ్రయించారు ఇందుకూరి వెంకట రామరాజు అనే వ్యక్తి. ఆయనిచ్చిన కంప్లైంట్‌ ఆధారంగా విచారణ జరిపిన హైకోర్టుల ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై ఇన్వెస్టిగేషన్‌ చేసి ఏసీబీ ఇచ్చిన నివేదికను అప్పటి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీఐడీని ఆదేశించారు.

ఆ తర్వాత సీఎస్‌గా వచ్చిన నీలం సాహ్ని కూడా మరోసారి దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేసింది. 2015లో ప్రభుత్వాస్పత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ నిర్వహణకు ఏపీఎస్‌ఎంఐడీసీ ద్వారా టెండర్లు పిలిచింది చంద్రబాబు సర్కార్‌. బెంగళూరుకు చెందిన టీబీఎస్‌ ఇండియన్‌ టెలీమాటిక్‌, బయో మెడికల్‌ సర్వీసెస్‌ అనే సంస్థకు టెండర్‌ ఖరారు చేసింది. ఐతే ఈ టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలొచ్చాయి.

టెండర్లు దక్కించుకున్న సంస్థ వైద్య పరికరాల విలువను మార్కెట్‌ ధరల కంటే అమాంతం పెంచేసి చీటింగ్‌ చేసిందని ప్రధాన ఆరోపణ. ఏడాదికి 460 కోట్ల రూపాయల భారీ మొత్తానికి టెండర్‌ కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని ఆరోపణలున్నాయి. మొత్తంగా 2వందల కోట్ల రూపాయల విలువజేసే ఎక్విప్‌మెంట్‌ను 5వందల కోట్ల రూపాయలుగా చూపించినట్లు చెబుతున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల మేర నిధులు నొక్కేశారన్న ఆరోపణల నిగ్గు తేలాల్సి ఉంది.

Read also :  ఏపీలో గ్రామ వాలంటీర్ల కళ్లల్లో ఆనందం.. సేవలకు సత్కారాలు, నగదు ప్రోత్సాహకాలు, లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్‌