Engineering Students Arrest: వారంతా ఇంజనీరింగ్ చదువుతున్నారు.. కానీ అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకొని దొంగతనాలు మొదలుపెట్టారు. చివరకు సెల్‌ఫోన్లను దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కారు. సెల్‌ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను గుంటూరు జిల్లాలోని చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సరావుపేటలో ఒక ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరూ విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి హాస్టళ్లల్లో, పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం విజ్ఞాన్ యూనివర్సిటీ ఎదుట ఉన్న సాయి బాలుర వసతి గృహాంలో ఎనిమిది సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్ దొంగతనం చేశారు. గతంలోనూ పలు చోట్ల దొంగతనాలు చేసి పోలీసులకు దొరికారు. ఈ కేసుల్లో శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు తెలిపారు.
జైలు శిక్ష అనుభవించి వచ్చిన రెండు నెలల్లోనే మరోసారి దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. అనుమానం వచ్చి వారిపై కొన్ని రోజుల నుంచి చేబ్రోలు పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో నారాకోడూరు వద్ద పోలీసులను చూసిన నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంబడించి ఇద్దరిని పట్టుకోగా.. దొంగతనం విషయం బయటపడింది. పవన్, గణేష్ అనే విద్యార్థుల నుంచి ఏడు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. వ్యసనాలకు అలవాటు పడిన విద్యార్థులు తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని డీఎస్పీ జెస్సీ ప్రశాంతి అన్నారు. అసాంఘిక కలాపాలకు పాల్పడితే.. వదిలిపెట్టమంటూ హెచ్చిరించారు.
Also Read: