Bogus Companies Accused: కృష్ణా జిల్లాలో బోగస్ కంపెనీల పేరుతో కోట్లు కొల్లగొట్టిన కేటుగాడిని ఎట్టకేలకు జీఎస్టీ అధికారులు ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచారు. వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో మిఠాయి కొట్టు నడిపిన రాంబాబు ఒక్కసారిగా కోట్లకు పరుగెత్తడంతో అందరికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. విషయం జీఎస్టీ అధికారులకు తెలియడంతో రాంబాబును హైదరాబాద్‌కు తరలించి విచారించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాంబాబు ఆరు బోగస్ కంపెనీలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఖజానా నుంచి రూ.48.99 కోట్లు కొట్టేసినట్లు తేలింది. గోపాల్ ట్రేడ్ ఇంపెక్స్, మారుతి ఎంటర్‌ప్రైజెస్, శ్రీఎంటర్‌ప్రైజెస్, లాస్య ఎంటర్ ప్రైజెస్, అభిజ్ఞ ఎంటర్ ప్రైజెస్, ఎస్వీ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో ఆరు బోగస్ కంపెనీలు క్రియేట్ చేశాడు. ఈ కంపెనీల ద్వారా వ్యాపారాలు చేసినట్టు నకిలీ ఇన్‌వాయిస్ సృష్టించి మోసాలకు పాల్పడ్డాడు. రాంబాబు దగ్గరి నుంచి జీఎస్టీ అధికారులు రూ.2.31 కోట్లను రికవరీ చేశారు. దీంతో ఇవాళ ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరుచగా ఈ నెల 16 వరకు కోర్టు రాంబాబుకు రిమాండ్ విధించింది.