Bihari gang atrocities : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో బీహారీలు భీభత్సం సృష్టిస్తున్నారు. గొల్లపల్లిలో రాత్రిళ్లు రోడ్ల పైకి వచ్చే వారిపై దాడులు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. బీహార్ కు చెందిన యువకులు. మద్యం మత్తులో రాడ్లు, కర్రలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి బైక్ పై వెళ్తున్న వారిపై తరచూ దాడులకు దిగుతున్నారు. ఇదే క్రమంలో శంషాబాద్ మండలంలో నిన్న అర్ధరాత్రి మరోసారి బీహార్ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. రషీద్ గూడకి చెందిన యువకులపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు దిగింది. దెబ్బలకు తట్టుకోలేక వాహనాలను వదిలేసి యువకులు పారిపోయారు. దీంతో బైకులను పూర్తిగా ద్వంసం చేసింది బీహార్ గ్యాంగ్.
వివరాల్లోకి వెళితే, రషీద్ గూడకి చెందిన శివమణితో గ్రామంలోని కిరాణ షాప్ దగ్గర బీహార్ గ్యాంగ్ గొడవ పడ్డారు. శివమణి స్నేహితులతో, గ్రామస్తులు కలిసి బీహార్ యువకులు ఉన్న స్థావరాలకు దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. గొల్లపల్లి నుండి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో కాపు కాసి.. దాడి చేశారు బీహారీలు. మొత్తం ఏడుగురు బీహార్ వ్యక్తులు తమపై దాడి చేశారని భాదితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో 8 బైక్ లు ధ్వంసం కాగా, ఇద్దరు యువకులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన పై బాధిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆరుగురు బీహారీ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
లాక్ డౌన్ తరువాత లేబర్ వర్క్ కోసం హైదరాబాద్ కి బీహార్ యువకులు వచ్చినట్లు విచారణ లో తేలింది. ఓ ఫామ్ హౌస్ లో వీళ్లంతా లేబర్ వర్క్ చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇక మద్యం మత్తులోనే ఆ యువకులు గ్రామస్తులు, యువకులు పై దాడులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక బీహార్ యువకులకు ఇష్టానుసారంగా ఇళ్లకు అద్దెకు ఇస్తున్నారని.. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఇంటి యజమానులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆరోపించారు. పోలీసులు నిఘా వైఫల్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తక్షణమే పెట్రోలింగ్ ను పెంచాలంటున్నారు గొల్లపల్లి గ్రామస్తులు.