Young man attack on traffic police : పోలీసులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్. జూబ్లీహిల్స్‌లో సీఐ, ట్రాఫిక్ సిబ్బంది పై జరిగిన దాడి ఘటనపై ఆయన టీవీ9తో మాట్లాడారు. దాడిని సీరియస్ గా తీసుకున్నామన్న ఆయన, పోలీసుల పై దాడులకు పాల్పడితే సహించేది లేదని తేల్చిచెప్పారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోంమంత్రి బంధువులమంటూ దురుసుగా వ్యవహరించారని, “నిందితులు హోంమంత్రి పేరు వాడారు… మహమూద్ అలీ కుటుంబంతో నిందితులకు ఎటువంటి సంబంధం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారైనా వదిలేపెట్టమని, దాడికి పాల్పడ్డ అందరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై మోసిన్, దర్వేశ్, అలీ, హసన్ లపై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశామని, వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని అడిషనల్ కమిషనర్ చెప్పారు.
కాగా, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో రూల్స్ బ్రేక్ చేసినందుకు మందలించిన పోలీసులపై యువకులు దాడికి తెగబడ్డారు. హద్దుమీరి ప్రవర్తించారు. బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో నడుపుతున్న యువకుడిని ట్రాఫిక్ పోలీసులు నిలదీశారు. అంతే, ఆ యువకుడి ఆగ్రహంతో ఊగిపోయాడు. పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ట్రాఫిక్ సీఐతో పాటు సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డాడు. హోంగార్డుపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో గాయపడ్డ హోంగార్డును తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లో మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ దర్వేజ్ అనే యువకుడు రచ్చ చేశాడు. బైక్ సైలెన్సర్ తీసేసి హెవీ సౌండ్‌తో రోడ్డుపై చక్కర్లు కొట్టాడు. చెవికి చిల్లులు పడే శబ్దంతో వీరంగం సృష్టించాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ సీఐ ఆ బైక్‌ను ఆపాల్సిందిగా హోంగార్డు రాథోడ్‌కు సూచించారు. ఆయన వాహనాన్ని నిలిపేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా హోంగార్డుపై దాడి చేశాడు.
హోంగార్డుపై దాడి చేస్తుండగా.. నిలదీసేందుకు సీఐ వెళ్లారు. ఆయన్ని కూడా ఈ యువకుడు నెట్టేసి దాడికి పాల్పడ్డాడు. పోలీసు సిబ్బందితో పాటు ఇతర వాహనదారులు ఎంత చెప్పినా అతడు వినిపించుకోకుండా స్నేహితులతో కలిసి నానా హంగామా సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. యువకుడితో పాటు అతడి స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాలుగు రోజుల క్రితం.. ఆంధ్ర, కర్నాటక బోర్డర్‌లో ఆంధ్ర కుర్రాడు సైతం ఇదే రేంజ్‌లో రెచ్చిపోయాడు. తన వాహనాన్ని ఆఫుతారా? ప్రిన్సిపల్ సెక్రటరీతో డైరెక్ట్‌గా మాట్లాడే రేంజ్ నాది. నన్ను ప్రశ్నిస్తారా అంటూ.. పోలీసులపై రుసరుసలాడాడు.
Read also : ఫొటోలతో సహా చెలరేగిన సజ్జల, చంద్రబాబు కుప్పం పర్యటన, స్వరూపానందస్వామిపై కామెంట్లకు కౌంటర్ అటాక్