
బీటెక్ పూర్తి..క్యాంపస్ సెలెక్షన్స్‌లో 3 కంపెనీల్లో సెలక్ట్ అయ్యాడు.. కానీ,అంతలోనే ఊహించని ఉప్పెన ఆ యువకున్ని మింగేసింది. హిమాచల్‌ప్రదేశ్ విహార యాత్రకు వెళ్లిన కడప జిల్లా యవకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం మేకల బాలాయపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మేకల బాలయ్యపల్లిలో నివాసముంటున్న గోగుల రమణయ్యకు ఇద్దరు కుమారులు ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన గోగుల ముని రాఘవ ఇటీవల పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో దాదాపు 3 కంపెనీలకు సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్బంగా స్నేహితులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ కొండచరియలు విరిగిపడిన ఘటనలో రాఘవ మృతిచెందాడు.
ఈ విషయం అతని స్నేహితులు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లక్షల్లో అప్పులు చేసి కొడుకును చదివిస్తే..చేతికందొస్తాడని ఆశపడ్డ ఆ తల్లీదండ్రులకు నిరాశే మిగిలింది. రాఘవ మరణవార్త ఆ గ్రామస్తులను సైతం శోక సంద్రంలో ముంచేసింది. ముని రాఘవ మృతదేహన్ని ఢిల్లీ నుండి ప్రభుత్వ సహాయంతో స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.