ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఇటీవల మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఆ కేసులోనే తీగ లాగితే డొంక మంత్రి అనుచరుల దగ్గరకు కదిలింది. ఈ కేసులో ఇప్పటికే మంత్రి జయరాం సోదరుడు శ్రీనివాసులు కారు డ్రైవర్ అంజిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే మంత్రి అనుచరులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 4న ఆలూరు మండలం కమ్మరచేడు దగ్గర గూడ్స్ ఆటోలో ఎరువుల మధ్య మద్యం బాటిళ్లు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు అధికారులు. 70 బాక్సుల్లో 96 టెట్రా పాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి జిల్లా నాదంగికి చెందిన ఆటో ఓనర్ కం డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతో మంత్రి తమ్ముడు శ్రీనివాసులు కారు డ్రైవర్ అంజిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మంత్రి అనుచరులు వెలమకూరు రాము, తెర్నేకల్ గురుపాదం, కరివేముల వీరేశ్, లకందిన్నె తిరుమలేష్, కోటకొండ లక్ష్మన్నలను అదుపులోకి తీసుకున్నారు. వీరికి మద్యం అక్రమ రవాణాతో సంబంధం ఉందని గుర్తించారు.
వీరు కాక కమ్మరచేడుకు చెందిన బసవరాజు, బొగ్గుల కురువ బసవరాజు అరెస్ట్ చేశారు. మంత్రి అనుచరుల అరెస్ట్‌పై అధికారులు స్పందించడం లేదు. గతంలో మంత్రి జయరాం మరో తమ్ముడు నారాయణస్వామిపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పేకాట ఆడిస్తూ కొందరు పట్టుబట్టారు. మంత్రి తమ్ముడే పేకాట శిబిరం వెనుక ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అయినా పోలీసులు ఎవరినీ వదిలిపెట్టకుండా అరెస్ట్ చేశారు. తాజాగా మద్యం అక్రమ రవాణా కేసు ఇంకెంత దూరం వెళుతుందోనన్న చర్చ జరుగుతోంది.
Also Read: Telangana: మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ.. రైతులకు ప్రభుత్వం స్పెషల్ రిక్వెస్ట్