Young Man died with Superstition Treatment: ఓ వైపు దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మరోవైపు ఇంకా మూఢ నమ్మకాలు, భూత వైద్యం అంటూ ప్రాణాలు తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఓ యువకుడికి దెయ్యం పట్టిందంటూ దారుణంగా కొట్టి చంపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా పల్లెల్లో మాత్రం..ఈ మూఢనమ్మకాలు జాడ్యం పోవడం లేదు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామానికి చెందిన వెంకటరాముడు, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు నరేష్(24) ఉన్నారు. డిగ్రీ వరకు చదివిన నరేశ్ గ్రామంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నాడు. ఈనెల 1న మూర్ఛతో అస్వస్థతకు గురికాగా తల్లిదండ్రులు స్థానిక భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
అయితే, అతనికి పట్టిన దెయ్యం, తాను వదిలిస్తానంటూ భూతవైద్యుడు ఈత బరిగెలు, కర్రలతో తీవ్రంగా కొట్టాడు. దీంతో నరేష్ తలకు గాయమై పరిస్థితి మరింత విషమించింది. భూతవైద్యుడి దెబ్బలకు తీవ్ర గాయాలపాలైన నరేష్‌ను.. కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు కుటుంబసభ్యులు. నరేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తల్లిదండ్రులను మందలించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా మృత్యువుతో పోరాడిన నరేశ్ ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మిత్రులే డబ్బులు పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు మూఢవిశ్వాసాలకు బలైన తీరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, ఘటనకు సంబంధించి కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.