Andhra Pradesh: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కట్నపు జ్వాలలో ఓ నవ వధువు సమిధై పోయింది. కాళ్లకు పారాణి ఆరకముందే నవ వధువు తనువు చాలించింది. పెళ్లైన నాలుగు నెలలకే ఆ యువతిని అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురి చేశారు. వారి వేధింపులు కాస్తా తారాస్థాయికి చేరి.. నవ వధువుచే పురుగుల మందు తాగించి హత్య చేశారు. పైగా యువతి మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని సి బెళగల్ మండలం గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన కువర సుజాతకు, మంత్రాలయం మండలం కల్లుదేవరకుంట గ్రామానికి చెందిన కురవ లక్ష్మన్నకు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కొంత నగదు, బంగారు ఆభరణాలు ఇచ్చారు. అయితే, దానితో సరిపెట్టుకునో భర్త, అత్త, మామలు.. మరో రూ. 5 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలంటూ సుజాతపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. అదనపు కట్నం కోసం పెళ్లైన నాటి నుంచి నిత్యం వేధింపులకు గురి చేసేశారు. ఈ క్రమంలోనే సుజాతా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందంటూ.. భర్త, అత్తమామలు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న సుజాత తల్లిదండ్రులు, బంధువులు కల్లుదేవకుంటకు వెళ్లారు. అయితే, మృతురాలి శరీరంపై గాయాలు ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు.. సుజాతను హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. భర్త, అత్త మామలు సుజాతను కొట్టి పురుగుల మందు తాగించి చంపేశారని, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుజాత తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా భర్త, అత్త మామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వేణు గోపాల్ రాజు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సుజాత మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుజాత మృతికి కారణమైన ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ధర్నాకు దిగారు బాధితులు.
Also read:
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని ఫిదా చేసిన వీరాభిమాని.. అతను కోరడమే ఆలస్యం..
Afghanistan Crisis: కాబుల్ విమానాశ్రయంలో పెలుళ్లు.. 110 కి చేరిన మృతుల సంఖ్య..