Pregnant Women Died: విశాఖ ఏజెన్సీలో విషాదం నెలకొంది. తరాలు మారినా తలరాతలు మారడం లేదన్నట్టు వారి ఆ గిరిజన పుత్రులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. వైద్యసేవల కోసం.. ఆదివాసీలు కష్టమైనా కిలోమీటర్ల మేర గర్భిణులను డోలీల్లో ఆసుపత్రులకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన హృదయవిదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. డోలీలో గర్భిణిని తీసుకువెళ్తుండగా.. దారి మధ్యలో ప్రసవించింది. సరిగ్గా.. ఆ తల్లి బిడ్డను చూసి మురిసిపోకముందే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం జన్మించిన శిశువు కూడా మరికాసేటికే మృతిచెందాడు. ఈ విషాద సంఘటన విశాఖపట్నం ఎజెన్సీ ఏరియాలో చోటుచేసుకుంది.
వివరాలు.. విశాఖ జిల్లాలోని జి మాడుగుల మండలం గెమ్మెలిబారు గ్రామానికి చెందిన కొర్రా జానకి నిండు గర్భిణి. నెలలు నిండడంతో సోమవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. రోడ్లు లేక రవాణా సదుపాయం అందుబాటులో లేకపోవడంతో కుటుంబసభ్యులు డోలీ కట్టి ఆసుపత్రికి బయలుదేరారు. జానకిని డోలీలో ఉంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గడుతూరు ఆసుపత్రికి పయనమయ్యారు. మార్గ మధ్యంలో ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. అనంతరం జానకి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే నవసామాలు మోసిన ఆ తల్లి.. బిడ్డకు మమకారం పంచకముందే అనంతలోకాలకు పయనమైంది. అనంతరం తల్లి మరణించిన కాసేపటికే శిశువు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అదే డోలీలో తల్లీబిడ్డల మృతదేహాలను.. కుటుంబసభ్యులు రోదిస్తూ వెనక్కి తీసుకెళ్లారు.
రోడ్డు లేకపోవడంతో.. వాహనాలు తిరగడం లేదని.. ఈ క్రమంలో తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయారని గెమ్మెలిబారు గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు. ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా.. డోలీ కట్టి వెళ్లే గిరిజనానికి మృత్యువువెంటాడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మన్యం ఉలిక్కిపడింది. దగ్గరలో వైద్య సదుపాయాలు లేవని.. అసుపత్రికి వెళ్లాలంటే.. రోడ్డులేక వాహనాలు రావని.. అత్యవసర పరిస్థితుల్లో డోలీని నమ్ముకున్నా ప్రాణాలు నిలవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Also Read: