Medicine Student Murder: ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యనే కడతేర్చాడు ఓ భర్త. పెళ్లైన పది నెలలకే ఆమెపై ఘాతుకానికి ఒడిగట్టాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగుచూసిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దాంపత్యంలో ఉన్న మనస్పర్థల కారణంగా ఓ పారా మెడికల్ విద్యార్థిని అత్యంత దారుణంగా హతమార్చాడు భర్త. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19) ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ ఎనస్తీషియా ప్రథమ సంవత్సరం చదువుతోంది. అయితే, ఆమె పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం యాళ్లగూడేనికి చెందిన 21 ఏళ్ల మానేపల్లి గంగరాజుతో పరిచయమైంది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమ చిగురించింది. పది నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది ఈ జంట. సుధారాణి హాస్టల్లో ఉంటూ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో చదువుకుంటోంది.
అయితే, ఈనెల 17న తన భర్త కాకినాడ రావడంతో స్థానిక కోకిల సెంటర్లోని ద్వారకా లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవకు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో గంగరాజు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన భార్య సుధారాణిని విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి సోమవారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో కాకినాడ ఎస్‌డీపీవో వి.భీమారావు, టూటౌన్ ఎస్‌ఐ పి.ఈశ్వరుడు సోమవారం రాత్రి సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.