అయ్యో దేవుడా.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. దంపతులు సహా కుమార్తె మృతి..

| Edited By: Shaik Madar Saheb

Nov 24, 2024 | 9:22 PM

టిప్పర్ లారీ డ్రైవర్ ఆదమరిచి లారీ తోలుతూ వెనుక నుంచి టూ వీలర్ బైక్ ను ఢీ కొనడంతో ఒక కుటుంబంలోని మనుషులంతా చనిపోయారు. భార్య, భర్త, కూతురు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం మూడు ప్రాణాలను బలి కొనడంతో పాటు.. ఒకరిని అనాథని చేసింది.

అయ్యో దేవుడా.. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. దంపతులు సహా కుమార్తె మృతి..
Road Accident
Follow us on

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు-పోరుమామిళ్ల మధ్య ఉన్న ప్రధాన రహదారిలో దారుణం చోటుచేసుకుంది. బైకును టిప్పర్ లారీ ఢీ కొనడంతో భార్య భర్త, వారి కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కాసినాయన మండలం వడ్డమానూరు గ్రామపంచాయతీలోని చిన్నాయపల్లి గ్రామానికి చెందిన గుర్రాల శ్రీనివాసరావు రెడ్డి… ఆయన భార్య అరుణ, కుమార్తె పవిత్ర ముగ్గురు మైదుకూరు మండలం తిప్పాయపల్లె గ్రామంలోని ఒక ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. శ్రీనివాసుల రెడ్డి అత్తగారి ఊరైన తిప్పాయపల్లెలో ఫంక్షన్ జరుగుతుంటే బైక్ పై వెళ్లి తిరిగి వస్తుండగా వెనకాలే వస్తున్న టిప్పర్ వారిని ఢీకొట్టింది. దీంతో వారు కింద పడిపోయారు. ఇది గమనించని టిప్పర్ డ్రైవర్ వారి మీద నుంచి వాహనాన్ని పోనివ్వడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇంత జరిగినా.. కనీసం మానవత్వంగా ఆయన డ్రైవర్ అక్కడ వాహనాన్ని ఆపి వారికి ఏమి జరిగింది అని కూడా చూడలేదు. లారీ ఆపకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అటుగా వస్తున్న కొందరు ఈ ఘటనను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అయితే చనిపోయిన శ్రీనివాసుల రెడ్డికి పాపతో పాటు 11 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబంలోని వారంతా చనిపోవడంతో ఆ బాబు ఇప్పుడు అనాధ అయ్యాడు.

ఒక డ్రైవర్ నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను తీయడంతో పాటు కుటుంబంలో ఒకరిని అనాధగా మిగిల్చింది. అదే లారీ స్పీడ్ గా కాకుండా నెమ్మదిగా వెళ్లి ఉండి ఉంటే.. యాక్సిడెంట్ అయిన చిన్న చిన్న దెబ్బలతో వారు బయటపడి ఉండేవారు.. వారిని ఢీకొట్టిన లారీ ఆగకుండా వారిపై నుంచి వెళ్లిందంటే.. ఆ లారీ స్పీడ్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా వాహనాలు నడిపేవారు వెనుక ముందు వచ్చే వాహనాలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..