
Crime News: సమాజం ఎంత అభివృద్ధి చెందినా కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా రాతి కాలంలోనే ఉండిపోతున్నాయి. వరకట్న వేధింపులతో అమాయక మహిళలను బలిగొంటున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌లో జరిగిన సంఘటన ఓ కుటుంబంలో విషాధాన్ని నింపింది. పెళ్లి జరిగి మూడు నెలలు కూడా నిండకుండానే వరకట్న పిశాచి మహిళను బలి తీసుకుంది. అమీన్‌పూర్‌లోని బంధంకొమ్ములో వరకట్న వేధింపులకు నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు వివరాలను తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్‌కు చెందిన విజయ్ దర్శన్ కుమార్తె సంయుక్త (24)ను రెండు నెలల క్రితం అమీన్‌పూర్ పట్టణం బందంకొమ్ము శ్రీధామ్ హిల్స్ కాలనీలో ఉన్న ఉత్తేజ్ కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపారు. ఉత్తేజ్ కుమార్ కొండాపూర్ యాక్సిస్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సమయంలో రూ. 15 లక్షల డబ్బు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చి ఘనంగా వివాహం జరిపారు. అయితే పెళ్లయిన నాలుగు రోజులకే అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. వివాహం జరిగిన నాలుగు రోజులకు వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో అత్త, మామ, భర్త సంయుక్తను వేధించడం మొదలు పెట్టారు.
‘నువ్వు ఇంట్లో అడుగు పెట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని’ సంయుక్తను టార్చర్ పెట్టారు. కొత్తకారు ఇప్పించాలని ఒత్తిడి పెంచారు. దీంతో ఈ విషయం తెలిసిన సంయుక్త తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్లి అల్లుడికి నచ్చచెప్పి పంపించారు. అయితే వేధింపులు మాత్రం ఆగలేదు. దీంతో విసిగిపోయిన సంయుక్త బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంయుక్త తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..