Bihar Spurious Liquor: మద్యపాన రహిత రాష్ట్రమైన బీహార్‌లో కల్తీ మద్యం మళ్లీ కలకలం రేపింది. కల్తీమద్యం తాగి బీహార్ రాష్ట్రవాప్తంగా 24 మంది మృత్యువాతపడ్డారు. దీంతో గోపాల్‌గంజ్, వెస్ట్ చంపారన్ జిల్లాల్లో విషాదం నెలకొంది. నకిలీ మద్యం తాగి ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం కారణంగా వెస్ట్ చంపారన్ జిల్లాలోని తెల్హువా గ్రామంలో ఎనిమిది మంది మరణించగా.. గోపాల్‌గంజ్ జిల్లా కుషాహర్, మహ్మద్‌పూర్‌లో 16 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా నకిలీ మద్యం తాగి ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు బీహార్ అధికారులు పేర్కొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరణాలకు గల కారణం తెలిసే అవకాశం ఉందని గోపాల్‌గంజ్ పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో దాదాపు 20 మంది గిరిజనులే ఉన్నారని పోలీసులు తెలిపారు. స్థానికంగా తయారు చేసిన మద్యం సేవించిన తర్వాతే వీరు చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే.. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. మద్యం తాగడంతోనే వారంతా మరణించినట్లు బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి.
కాగా.. కల్తీ మద్యంపై బీహార్ ప్రభుత్వం సీరియస్ అయింది. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఈ ఘటన అనంతరం బీహార్ మంత్రి జనక్ రామ్.. గోపాల్‌గంజ్ జిల్లా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా.. నితీష్ కుమార్ బీహార్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. ఈ ఏడాది నకిలీ మద్యం తాగి ఇప్పటివరకు 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read: