Anantapur Road Accident: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలంలోని బ్రహ్మణపల్లెకు కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడి ఇద్దరు మరణించారు. మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి పొలాల్లో పత్తి తీసేందుకు కూలీలంతా మినీ ఐచర్ లారీలో వెళ్తుండగా.. వాహనం అదుపుతప్పి చుక్కలూరు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 18 మందికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. రెండు రోజుల కిందట పామిడిలోని 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
Also Read: