18 Goats Killed : కరోనా వల్ల ఉపాధి కోల్పోయి గ్రామస్థులందరు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు ప్రకృతి కూడా వారిపై కన్నెర్ర జేస్తుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బుద్దారం గ్రామ శివారులో పిడుగుపాటుకు 18 మేకలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. బుద్దారం గ్రామానికి చెందిన ఐలయ్య తనకున్న మేకలన్నింటిని మేత కోసం గ్రామ పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటన్నింటిని తోలి తాను మరో చెట్టు కింద తలదాచుకున్నాడు.
ఇంతలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగుపడడంతో మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఐలయ్య చనిపోయిన మేకలను చూసి తీవ్ర ఆవేదనతో విలపిస్తున్నాడు. తమ జీవనాధారం గొర్రెలేనని, వాటిని పెంచి పోషించి.. వాటినే అమ్ముకొని జీవిస్తున్నామని, కూడబెట్టిన ఆస్తులు కూడా ఏమీ లేవని తమ గోడు వెల్లబోసుకున్నాడు. గొర్రెలను కాస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నామని, నోటికాడికి ఇంత ముద్ద వస్తుందంటే వాటివల్లేనని.. అవే ఇప్పుడు మృత్యువాతపడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఉపాధి పోవడంతో పాటు లక్షల రూపాయలు నష్టపోవడంతో ప్రభుత్వం ఐలయ్యను తగిన విధంగా ఆదుకోవాలని బుద్ధారం గ్రామస్థులు కోరుతున్నారు.