Truck Falls Into Gorge in UP: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళుతున్న ట్రక్ లోయలో పడటంతో 12 మంది మరణించారు. 45 మంది గాయపడ్డారు. ఈ సంఘటన యూపీలోని ఎటావా జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వారంతా కాళికా దేవి ఆలయానికి వెళుతుండంగా బార్‌పురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగ్రా జిల్లాకు చెందిన సుమారు 60 మంది లఖ్నా ప్రాంతంలోని కాళికా దేవి ఆలయానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ట్రక్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. ట్రక్ లోయలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు వెల్లడించారు.
గాయపడిన 45 మందిలో 13మందికి తీవ్ర గాయాలయ్యాయని వారికి ఉన్నత వైద్యం కోసం సైఫాయిలోని పీజీఐ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ ప్రశాంత్ కుమార్ ప్రసాద్ తెలిపారు.
కాగా.. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. చనిపోయిన వారందరికీ.. ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన వారికి ఉన్నత వైద్యం అందించాలని యోగి అధికారులను ఆదేశించారు.
Also Read: