మరణంలోనూ కవలలు కలిసే..తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి

|

Jul 21, 2020 | 12:59 PM

కరోనా కల్లోలం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కవలలుగా పుట్టిన ఇద్దరు అన్నాదమ్ములు కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు.

మరణంలోనూ కవలలు కలిసే..తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి
Follow us on

కరోనా కల్లోలం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. తల్లీబిడ్డలను దూరం చేస్తుంది. తోబుట్టువులను కానివారిగా చేస్తుంది. భార్యాభర్తల బంధానికి కూడా పరీక్షపెడుతోంది. కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వెలుగు చూస్తున్న ఇటువంటి ఘటనలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఓ తండ్రి తన కొడుక్కి కరోనా అని తెలియగానే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ ఆవేదనలో అతడు గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. కాగా, తాజాగా ఏపీలో అటువంటి సంఘటనే చోటు చేసుకుంది. కవలలుగా పుట్టిన ఇద్దరు అన్నాదమ్ములు కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నెల్లూరు జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. జిల్లాలోని ఏఎస్‌పేటలో కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. దీంతో అక్కడి దుకాణాలు, వ్యాపార సముదాలు నిబంధనల మేరకే అనుమతిస్తున్నారు. కాగా, వైరస్ వ్యాప్తి కారణంగా మద్యం షాపులను మూసివేశారు. దీంతో తాగేందుకు మద్యం దొరక్కపోవడంతో స్థానికంగా ఉన్న ఓ యువకుడు శానిటైజర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూనే అతడు మరణించాడు.

కాగా, మరణించిన వ్యక్తి ఇద్దరు కవలల్లో చిన్నవాడు. తమ్ముడి మరణం తట్టుకోలేక ఆ అన్న వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ  క్రమంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతడు కన్నుమూశాడు. గంటల వ్యవధిలోనే కవలలుగా పుట్టిన ఇద్దరు అన్నాదమ్ములు మ‌ృత్యువాత పడటంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కలిసి పుట్టిన కవలలు, మరణంలోనూ కలిసే చనిపోయారంటూ స్థానికులు సైతం కంటతడిపెట్టారు.