Covid 19 Primarily Affect Children: కరోనా మహమ్మారి రాబోయే మూడో వేవ్ పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందనే భయాల మధ్య, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆదివారం స్పష్టత ఇచ్చింది. మూడవ వేవ్ ప్రత్యేకంగా పిల్లలను ప్రభావితం చేసే అవకాశం లేదని అన్నారు. పిల్లల్లో పెద్దల మాదిరి త్వరగా వ్యాపించదని, అది వైరస్ ఉత్పరివర్తనాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో వ్యాధి సంక్రమణను ఎదుర్కొనే అవకాశం ఉంది, కానీ తీవ్రమైన వ్యాధి కాదని ఐఏపీ తెలిపింది. మూడవ వేవ్ ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేసే చాలా తక్కువని ఒక ప్రకటనలో తెలిపింది.
పిల్లలు కరోనా ప్రభావానికి గురవుతున్నప్పటికీ వారు ఎక్కువగా లక్షణాలు లేకుండానే ఉంటున్నారని, దీని వల్ల వారు వాహకాలుగా మారి వ్యాప్తికి కారకులవుతున్నారని కేంద్రం ఇటీవల పేర్కొంది. రాబోయే మూడో వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందన్న ఆందోళనల నేపథ్యంలో.. గత ధవారం జాతీయ కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వీకే పాల్ మాట్లాడారు. పెద్దలతో పోల్చదగ్గ స్థాయిలోనే పదేళ్ల వయసు దాటిన పిల్లలు కూడా కరోనా బారిన పడ్డారని, గత డిసెంబరు జనవరిలో ఐసీఎంఆర్ జరిపిన సీరో సర్వేలో ఈ విషయం తేలిందని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్న థర్డ్ వేవ్.. పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందా.. లేదా.. అన్న విషయం వైరస్ ఉత్పరివర్తనాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలపై ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు కొవాగ్జిన్‌కు ఇప్పటికే డీసీజీఐ అనుమతులిచ్చిందని, ఇవి మరో పది రోజుల్లోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వైద్య బృందం తాజాగా ప్రకటన విడుదల చేసింది. అంతగా భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 2020 నుంచి జనవరి 2021 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన చివరి సెరో సర్వేలో 10-17 సంవత్సరాల వయస్సులో సోకిన పిల్లల శాతం 25 శాతం ఉందని తేలింది. మొత్తంగా చూస్తే వైరస్ సోకిన చిన్నారుల్లో ఎక్కువమందికి చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఐఏపీ అసోసియేషన్ అధ్యక్షుడు బాకుల్ పరేఖ్ అన్నారు.
అలాగే, చాలా కొద్దిమంది చిన్నారులకు మాత్రమే ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స అవసరమైంది. మహమ్మారి రోజురోజుకు పెరిగిపోతుందన్నందున ఈ డేటా ఆధారంగా చికిత్స ప్రణాళికల్లో ప్రాధామ్యాలు నిర్ధరించుకోవడం మంచిదని పిల్లల వైద్య నిపుణులు సూచించారు. కోవిడ్-19తోపాటు ఇతర జబ్బులతో శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్న చిన్నారులలో చాలా తక్కువమందికి ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమవుతుందంటున్నారు.
కోవిడ్ -19 వల్ల పిల్లల్లో మరణాలు అత్యంత అరుదుగా ఉంటాయని యూరప్‌లో నిర్వహించిన ఓ సర్వే కూడా తేల్చింది. 582మంది పిల్లలను పరిశీలించగా అందులో ఇద్దరు మాత్రమే మరణించారని, మరో ఇద్దరు తీవ్రమైన ఆరోగ్యసమస్యలు ఎదుర్కొన్నారని ఆ పరిశోధన వెల్లడించింది. పిల్లల్లో వైరస్ లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయని, కొందరు పాజిటివ్ చిన్నారుల్లో అసలు లక్షణాలే కనిపించని సందర్భాలున్నాయని, 10మందిలో ఒకరికి ఇంటెన్సివ్ కేర్ అవసరమవుతుందని ఈ పరిశోధన వెల్లడించింది.