నెగిటివ్ వస్తేనే వలస కార్మికులను రాష్ట్రంలోకి రానివ్వండి: హైకోర్టు
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రంలోకి అనుమతించే విషయంపై ఒడిశా హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రంలోకి అనుమతించే విషయంపై ఒడిశా హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. కరోనా నెగిటివ్ వస్తేనే వారిని రాష్ట్రంలోకి అనుమతించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయవాదులు ఎస్ పండా, కేఆర్ మోహపాత్రా తీర్పును వెలువరించారు. ఒడిశాకు రావాలనుకుంటోన్న వలస కార్మికులు ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని న్యాయవాదులు తెలిపారు. అయితే ఆ టెస్ట్‌లకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి అనే విషయంపై మాత్రం వారు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పలు రైళ్లను రద్దు చేసింది.
దీనిపై సూరత్ ఒడియా వెల్ఫేర్ అసోషియేషన్ వీపీ భగీరథ్ బెహర మాట్లాడుతూ.. ”హైకోర్టు తీర్పుపై సూరత్‌లో ఉన్న ఒడిశీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కరోనా టెస్ట్ చేయించుకోవడం కోసం ఒక్కొక్కరికి రూ.3,500చొప్పున ఖర్చు అవుతుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పని లేకుండా ఉన్న వలస కార్మికులకు ఈ ఖర్చును భరించడం కష్టం. వలస కార్మికుల్లో చాలా మంది ఆహారం, వసతి సదుపాయాల్లేక ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు. కాగా ఒడిశాకు వచ్చిన వలస కార్మికుల్లో ఇప్పటికే 21 మంది కరోనా పాజిటివ్ సోకినట్లు తెలుస్తోంది.
Read This Story Also: ఏపీలో త్వరలో ‘కరోనా ఫ్రీ’గా మారనున్న ఆ జిల్లా..!