Top Ten States: పది రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు.. మహారాష్ట్ర అధికం కట్టడికి దారేది?

|

Apr 30, 2021 | 2:19 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రతి రోజు నమోదవుతున్న గణాంకాలు కలవరం రేపుతున్నాయి. గడచిన 24 గంటల్లో అంటే ఏప్రిల్ 29వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్ 30వ తేదీ ఉదయం దాకా దేశవ్యాప్తంగా...

Top Ten States: పది రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు.. మహారాష్ట్ర అధికం కట్టడికి దారేది?
Corona Virus
Follow us on

Top Ten States of Corona active cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ (CORONA SECOND WAVE) తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రతి రోజు నమోదవుతున్న గణాంకాలు కలవరం రేపుతున్నాయి. గడచిన 24 గంటల్లో అంటే ఏప్రిల్ 29వ తేదీ ఉదయం నుంచి ఏప్రిల్ 30వ తేదీ ఉదయం దాకా దేశవ్యాప్తంగా మూడు లక్షల ఎనభై ఆరు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు (CORONA POSITIVE CASES) సంఖ్య దేశ ప్రజలను కలవపరుస్తుంటే ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ (CORONA VIRUS) మొదటి వేవ్‌ను కంట్రోల్ చేయగలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెకండ్ వేవ్ వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. వ్యాక్సిన్ (VACCINE) తయారు చేసిన తర్వాత దాదాపు 84 దేశాలకు మన దేశపు వ్యాక్సిన్లను సరఫరా చేసిన ఇండియా (INDIA).. సెకెండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో మన దేశంలోనే వ్యాక్సిన్ కొరత కనిపించడం అతి దారుణమైన విషయంగా కనిపిస్తోంది. తగిన స్థాయిలో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయకుండానే 18 సంవత్సరాలకు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించడం విమర్శలకు దారితీస్తోంది. దానికి తోడు లక్షలసంఖ్యలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ బాధితులకు చికిత్స అందించేందుకు సరైన సదుపాయాలు లేకపోవడం కూడా బాధాకరమైన విషయం. దేశంలోని పలు ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ (OXYGEN) కొరత నెలకొని ఉండటం ప్రస్తుత దైన్యస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వాలు పైపైకి ఆక్సిజన్ కొరత లేదని.. ఐసియు బెడ్ల కొరత కూగీ లేదు అంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రభుత్వ అధినేతలు, అధికారుల ప్రకటనల్లో డొల్లతనం బయటపడుతోంది.

తాజాగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 8 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే దేశంలో పది రాష్ట్రాలలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో మహారాష్ట్ర (MAHARASHTRA) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం ఆరు లక్షల 72 వేల 302 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో కర్ణాటక (KARNATAKA కొనసాగుతోంది. కర్ణాటకలో మూడు లక్షల 49 వేల 515 కరోనా యాక్టివ్ కేసులు (CORONA ACTIVE CASES) ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ (UTTAR PRADESH) కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3 లక్షల 9 వేల 235 యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత స్థానం దక్షిణాదికి చెందిన కేరళ (KERALA)ది. కేరళ రాష్ట్రంలో 2 లక్షల 84 వేల 124 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తర్వాత స్థానంలో రాజస్థాన్ (RAJASTHAN) కనిపిస్తోంది. రాజస్థాన్లో లక్షా 69 వేల 519 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (GUJARAT) కనిపిస్తోంది. గుజరాత్లో లక్షా 35 వేల 794 కరోనా కేసులు ఉన్నాయి. గుజరాత్ తర్వాత స్థానంలో చత్తీస్‌గఢ్ (CHATTISGARH)ఉంది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో లక్షా 15 వేల 910. కరోనా యాక్టివ్ కేసులు నమోదై ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్ర ప్రదేశ్ (ANDHRA PRADESH) కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షా 14వేల 158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత స్థానంలో ఉన్న తమిళనాడు (TAMILNADU) రాష్ట్రంలో లక్షా 12 వేల 556 కరోనా పాజిటివ్ కేసులు నేటి వరకు నమోదై ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో వెస్ట్ బెంగాల్ (WEST BENGAL) కనిపిస్తోంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో లక్షా 10 వేల 241 యాక్టివ్ కేసులున్నాయి.

మొత్తం మీద దేశ వ్యాప్తంగా 30 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు ప్రస్తుతం కొనసాగుతుండగా ప్రతిరోజు మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వీటికి కలుస్తున్నాయి. గతంలో నమోదైన కేసులు చికిత్స పొంది బయటపడుతున్న వారి సంఖ్యను పరిశీలిస్తే కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉండింది. కానీ కరోనా వైరస్ మొదలైన తర్వాత మరీ ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతోంది. దీనికి కారణం కొత్త కేసుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యలో భారీ అంతరం ఉండడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలో వైద్య సదుపాయాలను పెంచకపోవడమే ప్రస్తుతం పెరిగిపోతున్న కరోనా కేసులు, వాటి ద్వారా మరణాలకు కారణమని పలువురు భావిస్తున్నారు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత మరో రెండు నెలల కాలం పాటు కొనసాగుతుందని వైద్య రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కరోనావైరస్ డబల్ మ్యూటెంట్ అయి శరవేగంగా విస్తరిస్తు ఉండడమే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రధాన మౌలిక నిబంధనలు అయిన మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లను విరివిగా వినియోగించడం, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రాకపోవడం వంటి స్వీయ క్రమశిక్షణను పాటించడం ద్వారా కరోనా వైరస్ ఉధృతికి కట్టడి వేయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికి తోడు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం జనాభాకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా మరో రెండు నెలల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌కు బ్రేక్ వేయవచ్చునని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.