
కరోనా..లాక్‌డౌన్..ఇదే ప్రస్తుత ప్రపంచాన్ని నడిపిస్తోంది. వైరస్ కారణంగా పట్టణాలు,నగరాలకు వలస వెళ్లిన ప్రజలంతా తిరిగి ఇప్పుడు సొంతూళ్ల బాటపట్టారు. ఎక్కడెక్కడి వలస కూలీలు, కార్మికులంతా గత మూడు నెలలుగా తమ గ్రామాలు, పల్లెలకు చేరుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యను ముందుగా పసిగట్టిన కేంద్రప్రభుత్వం వారందరికీ ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వివరించారు. ఎంజీఆర్ఈజీఏ పథకం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీలో నిరుద్యోగ సమస్యలపై కూడా భాగం ఉందన్నారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు కరోనా నేపథ్యంలో తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారని, దీంతో కొంత కాలం తర్వాత గ్రామాల్లో కూలీలకు ఉపాధి పనులు కరువవుతాయని చెప్పారు. ఆ సమయంలో ఇటువంటివారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను అనుమతించినట్లు తెలిపారు.
మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (ఎంజీఆర్ఈజీఏ) క్రింద రూ.33,000 కోట్లు ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. రూ.21,000 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సోమవారం వరకు 18 కోట్ల వ్యక్తిగత పని దినాలను సృష్టించినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎంజీఆర్ఈజీఏ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులను రూ.1 లక్ష కోట్లకు పైగా పెంచినట్లు తెలిపారు. దీంతో సొంతూళ్లకు చేరినవారు కూడా తమ ప్రాంతాల్లోనే పనులు చేసుకునే అవకాశం దొరుకుతుందని వారు స్పష్టం చేశారు.