రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరగా… 186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 605 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అటు కరోనా భారినపడి 18 మంది మరణించారు. శనివారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 31 పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 12,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ శనివారం ప్రభుత్వానికి అందజేసిన అంతర్గత నివేదికలో వెల్లడించింది. వారిలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కాంటాక్ట్‌లకు ఎంత మందికి వచ్చిందన్న వివరాలను తెలిపింది. అలాగే మర్కజ్‌కు నేరుగా వెళ్లొచ్చిన వారిలో ఎందరికి పాజిటివ్ వచ్చింది, వారి ద్వారా ఇంకెంత మంది వైరస్‌బారిన పడ్డారో కూడా వెల్లడించింది.
మొత్తంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,247 కాగా వారందరికీ పరీక్షలు పూర్తయ్యాయి. వారి ద్వారా నేరుగా కాంటాక్ట్ అయినవారు 2,593 మంది ఉండగా వాళ్లకు కూడా పరీక్షలు నిర్వహించారు. నారాయణపేట్ అభాంగాపూర్‌కు చెందిన రెండు నెలల చిన్నారి అస్వస్థతకు గురవడంతో నిలోఫర్‌కు తరలించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి గాంధీ ఆస్పత్రికి ఆ కుటుంబంలోని ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు.
ఇక గత వారం రోజుల లెక్కల్ని పరిశీలిస్తే.. 279 మందిలో వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అత్యధికంగా GHMC పరిధిలోనే 548 పాజిటివ్ కేసులున్నాయి. శనివారం ఒక్కరోజే గ్రేటర్‌పరిథిలో 31 కేసులు నమోదయ్యాయి. గద్వాల జిల్లాలో ఏడు, సిరిసిల్ల 2, రంగారెడ్డి 2, నల్గొండ జిల్లాలో ఒక కేసు నమోదైంది. హైదరాబాద్ తర్వాత రెండో అత్యధిక కేసుల జిల్లాగా నిజామాబాద్ నిలిచింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటిదాకా 58 కేసులు బయటపడ్డాయి.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ రావడం వైద్యులను తీవ్రంగా కలవర పెడుతోంది. హాస్పిటల్‌లో నిత్యం 300 మంది వైద్యులు, 400 మంది నర్సులు, మరో 500 మంది నాలుగో తరగతి సిబ్బంది, వైద్య విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. వీరందిరకీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ మసీదుల్లో దాక్కున్న పలువురు విదేశీయులపై కేసు నమోదు చేశారు పోలీసులు. పంజాగుట్ట మసీదులో ఉన్న 9 మంది కిర్గిస్తానీయులు.. ఫలక్‌నూమా మసీదులో ఉన్న ఆరుగురు ఇరానీలపై కేసులు పెట్టారు.
నిర్మల్ జిల్లా తానూరు మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న లారీ డ్రైవర్‌ను పోలీసులు శని వారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా మోటివాడి మండలానికి చెందిన లారీ డ్రైవర్ తనకు కరోనా లక్షణాలు ఉండటంతో ఐదు రోజుల క్రితం స్థానిక ఆస్పత్రిలో చూపించుకున్నాడు. ఈనెల15న నూజివీడు నుంచి మామిడి పండ్ల లోడ్‌తో మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాకు వెళ్లాడు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యాధికారులు అతన్ని ఫోన్లో సంప్రదించారు. తాను బుల్డానా జిల్లా నుంచి ఉల్లిగడ్డ లోడ్‌తో తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు తెలపడంతో వారు తెలంగాణ అధికారులను ఫోన్‌లో అప్రమత్తం చేశారు. దీంతో తానూరు మండల పోలీసులు, వైద్యాధికారులు అతన్ని బెల్‌తరోడా వద్ద అదుపులోకి తీసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించా రు. క్లీనర్‌ను నిర్మల్ క్వారంటైన్‌కు తీసుకెళ్లారు.