రాష్ట్రంలో భారీగా పెరిగిపోతున్న కరోనా మహమ్మారి కేసులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరింత వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రయోగాత్మకంగా మూడు వజ్ర బస్సులను కోవిడ్ సంచార పరీక్షా కేంద్రాలుగా మార్చిన ప్రభుత్వం.. వాటి ద్వారా మంచి ఫలితాలు రాబట్టింది. దీంతో మరికొన్నివజ్ర బస్సులను సంచార ల్యాబ్ లుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న క్రమంలో దాదాపు అన్నిరంగాలు ఘోరంగా దెబ్బదిన్నాయి. రవాణా, పారిశ్రామిక, ఉత్పాదక రంగాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులన్నీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ సంస్థ పూర్తిగా నష్టాలలో కూరుకుపోయింది. ఓ వైపు వజ్ర మినీ బస్సులు కూడా ఓ నష్టాలు మూటగట్టుకున్నాయి. దీంతో వాటిని తిరగకుండా ఆపేసింది సర్కార్. అయితే ఇప్పుడు ఇవే బస్సులు కోవిడ్ పరీక్షా కేంద్రాలుగా మార్చేసింది.
తెలంగాణలో ఇటీవలే ఓ 3 వజ్రా బస్సులను కోవిడ్ సంచార పరీక్షాకేంద్రాలుగా ప్రయోగాత్మకంగా మార్చారు. ఆ బస్సులను రవాణామంత్రి పువ్వాడ అజయ్ సొంత జిల్లా ఖమ్మంలో వినియోగిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా ప్రతి రోజు దాదాపు 750 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా మంచి ఫలితాలు రావడంతో మరి కొన్ని వజ్ర బస్సులను సంచార ల్యాబ్‌లుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
ఆర్టీసీకి గుదిబండగా మారి, నష్టాలు మూటగట్టిన వజ్ర మినీ బస్సులు కోవిడ్ పరీక్షల విషయంలో బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు సంచార పరీక్ష కేంద్రాలుగా మినీ బస్సులపై ప్రయోగం సక్సెస్ కావడంతో మిగతా 63 బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఆరంభమైనట్టు సమాచారం. ఇప్పట్లో కోవిడ్ సమస్య సమసిపోయేలా లేకపోవటంతో మిగతాజిల్లాలకు కూడా వీటిని ల్యాబ్‌లుగా మార్చి ఇతర జిల్లాలకు కేటాయించాలనే సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి.
ఒక్కో బస్సుల్లో ముగ్గురు టెక్నీషియన్లు ఉండేలా ఏర్పాటు చేశారు. బస్సు వెలుపల కరోనా అనుమానితులు నిలబడితే, కిటికీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాల ద్వారా టెక్నీషియన్లు నమూనాలు సేకరించేలా ఏర్పాటు చేశారు. ఇది సురక్షితంగా ఉండటంతో టెక్నీషియన్లు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా నమూనాలు సేకరిస్తున్నారు. మినీ బస్సులు కావటంతో ఇరుకు ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోగలుగుతున్నాయి.
ఆర్టీసీలో వంద వరకు వజ్ర బస్సులున్నాయి. వీటిల్లో యాక్సిడెంట్లు అయినవి, మరమ్మతులకు నోచుకోనివి పోను 66 బస్సులు కండీషన్‌లో ఉన్నాయి. కోవిడ్ సమస్య ఉత్పన్నం కాకముందు వరకు ఆ బస్సులు నడిచాయి. అయితే వాటికి ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండటం, నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండి భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. గతేడాది సమ్మె తర్వాత ఈ బస్సులను వేలం వేసి అమ్మేయాలని నిర్ణయించారు. అయితే కోవిడ్ సమస్య కారణంగా ఈ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
ఇక కోవిడ్ ఎఫెక్ట్ ఆర్టీసీపై భారీగా పడింది. సర్వీసుల సంఖ్య సగానికి పడిపోగా..నిర్వహణ ఖర్చుల మేరకు కూడా రాబడి లేదని సంస్థ ఉన్నతాధికారులు వాపోతున్నారు. దీంతో జీతాలు చెల్లించేందుకు కూడా ప్రతీ నెలా అప్పుల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది.