నేడు సూర్య గ్రహణం కారణంగా విజయవాడ కనదుర్గ ఆలయంలో అన్ని సేవలు, దర్శనాలు రద్దు అయ్యాయి. గ్రహణం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆలయాన్ని తెరిచి అర్చకుల సమక్షంలో సంప్రోక్షణ చేయనున్నారు. మరోవైపు కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కృష్ణా నదిలో గ్రహణ స్నానాలు నిషేధిస్తూ నగరపాలక సంస్థ ప్రకటన జారీ చేసింది. ఎవరూ నదికి స్నానాలకు రావద్దని కోరింది.
కాగా సోమవారం 22వ తేదీ నుంచి జులై 20వ తేదీ వరకూ బెజవాడ దుర్గమ్మకు ఆషాడ సారె సమర్పణ కార్యక్రమం చేపట్టనున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే మాస్కులు ధరించి అమ్మవారికి సారె సమర్పించేందుకు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు తొలిసారెను శాస్త్రోక్తంగా.. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారికి తొలి సారెను సమర్పించనున్నారు.
కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 491 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,452కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 390 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 83 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. అలాగే 4,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి.