Coronavirus Cases: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. దాదాపు కొన్ని నెలల తరువాత కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రతిరోజూ వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 62,258 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో మాత్రం సగానికి పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న అక్కడ 36,902 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రతో పాటు పంజాబ్ (3,122), ఛత్తీస్‌ఘఢ్ (2,665), కర్ణాటక (2,566), గుజరాత్ (2,190), మధ్యప్రదేశ్ (2,091) రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో సుమారు 80 శాతం కేసులు ఈ ఆరు రాష్ట్రాల్లోనే బయటపడ్డాయని వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 4,52,647 యాక్టివ్ కేసులున్నాయి. వాటిలో 73 శాతం కేసులు.. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లోనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
దీంతోపాటు గడిచిన 24 గంటల్లో 291 మంది మృతి చెందగా.. వారిలో ఒక్క మహారాష్ట్రలో 112 మంది ఉన్నారని తెలిపింది. తాజాగా 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాలు సంభవించలేదని కేంద్రం తెలిపింది. అసోం, ఒడిశా, పుదుచ్చేరి, లఢఖ్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అండమాన్ నికోబార్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసి పలు సూచనలు చేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించినప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఎన్నడూ లేని ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు పలు ఆంక్షలను విధిస్తున్నాయి.
Also Read: