దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుముందు జోరందుకోనుంది. ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు (కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుట్నిక్ వీ) దేశ ప్రజలకు అందుబాటులోకి రాగా…మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి జూన్ మాసంలోనే గణనీయంగా పెరిగే అవకాశముంది. కొవిషీల్డ్, కొవాక్జిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పని మొదలుపెట్టాయి. జూన్ మాసంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(SII) దాదాపు 9 నుంచి 10 కోట్ల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది. కొవిడ్ వ్యాక్సిన్ల కొరతపై పలు రాష్ట్రాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీరమ్ సంస్థ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది.
వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు తమ ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో సీరమ్ తెలియజేసింది. మే మాసంలో సీరమ్ ఉత్పత్తి సామర్థ్యం 6.5 కోట్లు కాగా…దీన్ని 10 కోట్లకు పెంచనున్నట్లు వెల్లడించింది. అటు భారత్ బయోటెక్ కూడా మే మాసంతో పోలిస్తే జూన్ మాసంలో వ్యాక్సిన్ల(కొవాక్జిన్) ఉత్పత్తిని గణనీయంగా పెంచనుంది.
జులై నాటికి ప్రతి రోజూ కోటి మందికి వ్యాక్సిన్లు..
ఈ సంవత్సరం చివరినాటికల్లా దేశంలోని అందరికీ కొవిడ్ వ్యాక్సిన్లు అందేలా చూస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రెండ్రోజుల క్రితం ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్(AIIMS) చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందు ముందు జోరందుకోనున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు వాటి ఉత్పత్తిని గణనీయంగా పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే విదేశాల నుంచి వీలైనన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. జులై మాసం చివరి నాటికి దేశంలో ప్రతి రోజు కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశమున్నట్లు గులేరియా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
అవిసె గింజలతో బరువు సులువుగా తగ్గొచ్చు తెలుసా..? ఇంకా లాభాలు తెలిస్తే షాకే..
కొలనులో నీరు తాగుతున్న చిరుత పులి ఒక్కసారిగా భయంతో పరుగులు తీసింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..