ప్రపంచ దేశాలకు ఉమ్మడి శత్రువుగా మారింది కరోనా వైరస్. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు యావత్ దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే, కోవిడ్ ఉధృతికి అడ్డూ అదుపు లేకుండా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులతో అమెరికా, బ్రెజిల్ దేశాలు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా… మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఇక రష్యాలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గటం లేదు.
రష్యాలో విలయతాండవం చేస్తున్నకోవిడ్ పంజా విసురుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,632 మందికి కరోనా వైరస్ సోకిందని ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా తొమ్మిదో రోజూ 7వేలకు చేరువలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,74,515 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 10వేల మార్కును దాటేసింది. దేశంలో కరోనా కారణంగా శనివారం వరకు 10,027 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక రష్యా తర్వాతి స్థానంలో ఉన్నది మనదేశమే.