Ratan Tata – Corona vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. జనవరి 16 నుంచి నిర్విరామంగా ప్రతిరోజూ లక్షలాది మందికి కోవిడ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో మార్చి 1న ప్రారంభమైన రెండో విడత వ్యాక్సినేషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీకా తీసుకుంటే అసలు నొప్పే లేదని రతన్ టాటా పేర్కొన్నారు. అందరూ త్వరలోనే వ్యాక్సిన్ వేసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానంటూ ఆయన ట్విట్ చేశారు. అయితే.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రతన్ టాటా రూ.1500 కోట్ల విరాళాలు ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కష్ట పరిస్థితుల్లో ఆయన స్పందనపై అప్పట్లో చాలామంది ప్రశంసించారు.
వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ..
ముందుగా దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందించారు. అనంతరం మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లపైన వారికి టీకాలు ఇస్తున్నారు. కాగా.. వ్యాక్సినేషన్ పక్రియలో భాగంగా.. శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 2,82,18,457 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇదిలాఉంటే.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,882 కరోనా కేసులు నమోదుకాగా.. 140 మంది మరణించారు. ఈ కేసులతో కలిపి దేశంలో కేసుల సంఖ్య 1,13,33,728 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 1,58,446 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,02,022 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Also Read: