ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గుబులురేపుతోంది. భారత్‌లోనూ రోజు రోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 107 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే కరోనాపై యుద్ధం ప్రకటించాయి ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చిరంజీవి. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల హర్షం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడలను వాయిదా వేయడం, సినిమా హల్స్‌ను, మాల్స్‌ను మూసివేయడం, స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. ప్రజలు కూడా ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సినిమా షూటింగుల్లో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు పనిచేయాల్సి ఉందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగులు వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నానన్నారు.
ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనన్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉధ్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు.