Lockdown in Karnataka: దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. అన్ని చోట్లా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కేసులు, మరణాలు భారీగా పెరుగుతుండటంతో అంతటా ఆందళన నెలకింది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. ఆ లాక్‌డౌన్ గడువు ముగిసిపోతుండటంతో.. మళ్లీ ఆయా రాష్ట్రాలు పొడిగిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కర్ణాటకలో మరో రెండు వారాలపాటు (ఈ నెల 24 నుంచి జూన్ 7న ఉదయం 6గంటల వరకు) లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం యడియూరప్ప శుక్రవారం ప్రకటించారు. వైరస్ కట్టడికి మే 10న ప్రకటించిన కఠిన ఆంక్షలు ఈ నెల 24తో పూర్తి కానుండటంతో యడియూరప్ప.. మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కేసులు అదుపులోకి రాని దృష్ట్యా నిపుణుల అభిప్రాయం మేరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం యడియూరప్ప వెల్లడించారు. దీంతోపాటు బ్లాక్ ఫంగస్ రోగులకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స అందజేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే అమలవుతున్న మార్గదర్శకాలే రాష్ట్రంలో కొనసాగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. కేసులు పెరుగుతున్న కారణంగా.. ప్రజల కదలికలను నివారించాలని అధికారులను ఆదేశించారు. బయట అనవసరంగా ఎవరూ తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్క్‌లు ధరించాలని పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.
ఇదిలాఉంటే.. కర్ణాటకలో కొత్తగా 32,218 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 353 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 23,67,742కి చేరగా.. మరణాల సంఖ్య 24,207కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,14,238 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: