బెంగళూరులో కొంపముంచిన దావత్.. ఏకంగా 103 మంది అపార్ట్‌మెంట్ వాసులకు కరోనా పాజిటివ్ నిర్దారణ

|

Feb 16, 2021 | 6:32 PM

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. అయినా, నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు. పార్టీ చేసుకున్న ఓ అపార్ట్‌మెంట్ సభ్యులు కరోనా బారినపడ్డారు

బెంగళూరులో కొంపముంచిన దావత్.. ఏకంగా 103 మంది అపార్ట్‌మెంట్ వాసులకు కరోనా పాజిటివ్ నిర్దారణ
Follow us on

103 persons test covid : పండుగలు, పబ్బాలపై ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా జనం అంతగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా విజ‌ృంభిస్తున్న కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. అయినా, నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. పార్టీ చేసుకున్న ఓ అపార్ట్‌మెంట్ సభ్యులు కరోనా బారినపడ్డారు.

అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వారిలో 103 మంది కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ ఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 4న బొమ్మనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో అపార్ట్‌మెంట్‌వాసులందరూ పాల్గొన్నారు. అనంతరం వారిలో కొందరు దేహ్రాదూన్‌ ట్రిప్‌కు వెళ్లేందుకుగానూ కరోనా టెస్టులు చేయించుకున్నారు. వారి టెస్టు రిపోర్టులను ఫిబ్రవరి 10న వచ్చాయి. దీంతో వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే అప్రమత్తమై అపార్టుమెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ సభ్యులు బీబీఎంపీ అధికారులకు సమాచారమిచ్చారు.
దీంతో అధికారులు మరోసారి అపార్టుమెంట్ వాసులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ అపార్టుమెంటులో ఉన్న 1,052 మందికి టెస్టులు చేయగా వారిలో 103 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 96 మంది అరవై ఏళ్లకు పైబడిన వారేనని బీబీఎంపీ కమిషనర్‌ మంజునాథ్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చేరగా మిగతా వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. అపార్ట్‌మెంటులో ఉన్న అందర్నీ క్వారంటైన్‌లో ఉంచామన్నారు.

ఇక, పాజిటివ్‌ వచ్చిన వారిలో చాలామందికి ఎలాంటి లక్షణాలు లేవని బీబీఎంసీ అదనపు కమిషనర్‌ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ నియమాల మేరకు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించామన్నారు. అపార్ట్‌మెంట్‌ నిర్వాసితులకు అవసరమైన అన్ని వస్తువులను వారికి అందిస్తామని ఆయన తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఏవైనా కరోనా వేరియంట్లు ఉంటే గుర్తించేందుకు అందరి నమూనాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, న్యూరో సైన్సెస్‌(నింహాన్స్‌)కు పంపామని అధికారులు వెల్లడించారు.

Read Also…  రేషన్ కార్డు వదులుకోవాలన్న వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన కర్ణాటక మంత్రి.. అలాంటి ఆలోచన లేదని వివరణ