ఇండిగో ఎయిర్‌లైన్స్: ఏడాది పాటు ఛార్జీల్లో రాయితీ..వారికి మాత్రమే..

|

Jul 02, 2020 | 5:28 PM

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణ ఛార్జీల్లో 25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ముందంజలో ఉండి పోరాడుతున్న సిబ్బంది..

ఇండిగో ఎయిర్‌లైన్స్: ఏడాది పాటు ఛార్జీల్లో రాయితీ..వారికి మాత్రమే..
Follow us on

కరోనా కల్లోల సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవ ఎనలేనిది. కోవిడ్ బాధితులకు వైద్యం అందిస్తూ.. ఐసోలేషన్ వార్డుల్లో ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ తో బాధ పడుతున్న వారి ప్రాణాలు కాపాడుకోవటానికి, వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి యావత్ ప్రపంచం సలామ్ చేస్తోంది. వైద్యసిబ్బంది సేవలకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా తమవంతు కృత‌జ్ఞ‌త‌ను చాటుకుంటోంది.

డాక్టర్లు, నర్సులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆఫర్ ప్రకటించింది. డాక్టర్లకు, నర్సులకు ప్రయాణ ఛార్జీల్లో 25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ముందంజలో ఉండి పోరాడుతున్నందున వీరికి ఈ ఏడాది చివరి వరకు విమాన ఛార్జీలపై రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. నర్సులు, వైద్యులు చెక్‌ ఇన్ సమయంలో వారి గుర్తింపును, ఆస్పత్రి ఐడీలను అందించాల్సి ఉంటుందని తెలిపింది. ఇండిగో వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూడా డిస్కౌంట్ ఇవ్వబడుతుందని తెలిపింది. ఈ ఆఫర్ ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో రెండు నెలల విరామం తర్వాత మే 25న విమానాలు తిరిగి తమ సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.