
ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ కేసులను అదుపు చేసేందుకు రీసెర్చర్లు వివిధ రకాల వ్యాక్సీన్ల తయారీకి కృషి చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా 155 కి పైగా వ్యాక్సీన్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 23 హ్యూమన్ ట్రయల్స్ దశలోనూ, 135 వ్యాక్సీన్లు జంతువులపై పరీక్షలు జరిపే దశలోనూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రధానంగా జెనెటిక్ వ్యాక్సీన్, వైరల్ వెక్టార్, ప్రోటీన్ బేస్డ్, హోల్ వైరస్ వ్యాక్సీన్లు వివిధ దశల ట్రయల్స్ లో ఉన్నాయి. ఇండియాకు సంబంధించి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ఈ తరహా వ్యాక్సీన్ల తయారీలో ఉన్నాయి. ముఖ్యంగా ‘కోవ్యాక్సీన్’.. ప్రపంచ వ్యాక్సీన్ల లిస్టులో చేరింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అప్పుడే హ్యూమన్ ట్రయల్స్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అలాగే దేశంలోని మరో 12 ఆసుపత్రులు కూడా ఈ వ్యాక్సీన్ కి సంబంధించి హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. మొత్తం మూడు దశల్లో వీటిని నిర్వహిస్తారు. ఎయిమ్స్ లో కోవ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ కి అప్పుడే విశేష ప్రచారం లభిస్తోంది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో రీసెర్చర్లు వీటి డేటా సేకరణను ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
అటు రష్యాలోని ఓ కంపెనీ కూడా ఆగస్టు 3 నుంచి తాము ఉత్పత్తి చేసిన వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ ని కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో వేలాది మందికి నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించింది.