ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. భారత్‌లో కరోనా కేసులు వరుసగా నాలుగో రోజూ 40 వేలకుపైగా వెలుగచూశాయి. కొత్తగా 45,083 మందికి వైరస్ సోకింది. మరో 460 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. కొత్తగా 35,840 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.
వ్యాక్సినేషన్లో పరంగా ఇండియా దుమ్ములేపుతోంది. శనివారం 73 లక్షలకుపైగా వ్యాక్సిన్ డోసుల్ని లబ్ధిదారులకు అందించారు. మొత్తంగా ఇప్పటివరకు 63 కోట్ల 9 లక్షల 17 వేల 927 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కేరళలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. శనివారం దేశవ్యాప్తంగా నమోదైన 45,083 కేసుల్లో 31,265 కేరళలోనే నమోదయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ కారణంగా తిరువనంతపురం సహా పలు ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కేరళ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్యలో క్రియాశీల కేసులున్నట్లు తెలిపింది. జులైలో రెండు పండగల కోసం ఆంక్షలను సడలించిన నాటి నుంచి కేరళలో మరోసారి వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులు అలెర్ట్..