విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ఇస్తున్న మలేరియా డ్రగ్.. హైడ్రాక్సీక్లోరోక్విన్ తో సహా హెచ్ ఐ వీ.. లోపినవిర్, రైటోనవిర్ కాంబినేషన్ డ్రగ్స్.. దాదాపు నిష్ప్రయోజనమైనవిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. ఇతర మందులతో పోలిస్తే ఇవి కరోనా రోగుల మరణాలను నియంత్రించలేకపోతున్నాయని ఈ సంస్థ అభిప్రాయపడినట్టు అల్ జజీరా పేర్కొంది. తక్షణమే ఈ ట్రయల్స్ ని నిలిపివేస్తున్నారని, తదుపరి పరిశోధనలు నిర్ధారించిన తరువాతే బహుశా తిరిగి ట్రయల్స్ ప్రారంభం కావచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు వెల్లడించాయి. అయితే సాధారణ కరోనా రోగులకు ఇస్తున్న డ్రగ్స్ వినియోగంపైన, జరుగుతున్న అధ్యయనాలపైన దీని ప్రభావం ఉంటుందా అన్న విషయాన్ని చెప్పలేకపోతున్నారు. గత 24 గంటల్లో 212,326 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఈ వర్గాలు తెలియజేశాయి. అలాగే ఇదే కాలంలో 5,134 మరణాలు సంభవించాయని, దీంతో ఈ సంఖ్య 523,011 కి చేరిందని వివరించాయి. మలేరియా మందు హైడ్రాక్సితనకు మంచి మెడిసిన్ అని, దీన్ని ఇండియా నుంచి తాను తెప్పించుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లోగడ ప్రకటించడం, ఇందుకు ఇండియా వెంటనే ఈ మందును ఆ దేశానికి ఎగుమతి చేయడం తెలిసిందే. అయితే అది తనకు చేరిన తరువాత తను రోజూ దాన్ని తీసుకుంటున్నానా అన్న విషయాన్ని ట్రంప్ క్లారిఫై చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా దీని క్లినికల్ ట్రయల్స్ ని నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం ఆశ్చర్యపరుస్తోంది.