
కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో స్కూళ్లను ఈ నెల 31 వరకు మూసివేస్తున్నామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. మొదట ఈ నెల 5 వరకు విద్యా సంస్థలను మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కోవిడ్ ఇంకా ప్రబలంగానే ఉన్నందున ఈ తేదీని 31 వరకు పొడిగిస్తున్నామని సిసోడియా చెప్పారు. అన్ లాక్-5 దశలో ప్రవేశించిన నేపథ్యంలో.. స్కూళ్ళు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలను అక్టోబరు 15 తరువాత తిరిగి ప్రారంభించే విషయమై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చునని కేంద్రం ఇటీవల ప్రకటించింది. అయితే కరోనా వైరస్ పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. ఢిల్లీ నగరంలో కరోనా వైరస్ కేసులు మూడు లక్షలకు చేరుకోగా..5,400 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా ఈ కేసులు సుమారు అరవై అయిదు లక్షలకు చేరుకున్నాయి.