Booster Dose: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. తాజాగా కొత్త రకం వేరియంట్ డెల్టా ప్లస్ మరింత విజృంభిస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా కేసులు అధిక మొత్తంలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేశంలోని ప్రజలకు బూస్టర్ డోస్ అవసరమా? కాదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో బూస్టర్ షాట్ ఇచ్చేందుకు మరింత సమాచారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకు కావాల్సిన సమాచారమంతా వచ్చే ఏడాదిలో సమకూరొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధులు, అధిక ప్రమాదం ఉన్నవారి డేటా లేదని తీసుకున్న టీకా ఏమేర రక్షణ ఇస్తుందో తెలుసుకునే సమాచారం కచ్చితంగా అవసరమని పేర్కొన్నారు. భారత్‌లో బూస్టర్ షాట్ ప్రవేశపెట్టాలంటే మరికొన్ని నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత టీకాల సామర్థ్యంపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మూడో డోసు అవసరమా? లేదా అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని వివరించారు.
వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సోర్టియం ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తెలిపింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయడం లేదని ఆరోపిస్తుంది. డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళనకరంగా పేర్కొంది. ఇప్పటికే ఈ రకం వేరియంట్ 11 దేశాలకు వ్యాపించింది. అమెరికా, భారత్‌తో పాటు బ్రిటన్, పోర్చుగల్‌లో ఈ కేసులు సంఖ్య అధికంగా ఉంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభణకు ఈ వేరియం దోహదం కానుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. వ్యాక్సిన్‌తో పాటు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచిస్తోంది.