Covid-19 Warning: కరోనా వైరస్ భవిష్యత్ మార్పులపై యుఎన్ఓ సంచలన హెచ్చరిక.. ఫ్యూచర్‌లో కరోనా ఎలా వుంటుందంటే?

|

Mar 18, 2021 | 6:40 PM

కరోనా వైరస్ ఫ్యూచర్ రూపాంతరంపై ఐక్య రాజ్య సమితి కీలక హెచ్చరిక చేసింది. ఏడాది కాలంగా ప్రపంచ మానవాళిని గడగడ వణికిస్తున్న కరోనా ఇకపై...

Covid-19 Warning: కరోనా వైరస్ భవిష్యత్ మార్పులపై యుఎన్ఓ సంచలన హెచ్చరిక.. ఫ్యూచర్‌లో కరోనా ఎలా వుంటుందంటే?
Follow us on

Covid-19 warning by United Nations Organization: కరోనా వైరస్ ఫ్యూచర్ రూపాంతరంపై ఐక్య రాజ్య సమితి కీలక హెచ్చరిక చేసింది. ఏడాది కాలంగా ప్రపంచ మానవాళిని గడగడ వణికిస్తున్న కరోనా ఇకపై సీజనల్ వ్యాధిగా మారబోతోందా? ఈ ప్రశ్నకు ఐక్యరాజ్యసభ అవుననే సమాధానం చెబుతోంది. తాజాగా ఐరాస వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా ఇక ఎన్నటికీ అంతం కాకపోవచ్చు. మిగిలిన కొన్ని సీజనల్ వ్యాధుల్లాగానే కరోనా తరచూ తలెత్తే అవకాశాలున్నాయని ఐరాస తాజా నివేదిక అభిప్రాయపడింది. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా కరోనా తరచూ విస్తరించే ప్రమాదం వుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా వైరస్ ఇకపై సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని గురువారం ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను హెచ్చరించింది. వాతావరణ అంశాల ఆధారంగా కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వవద్దని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం గత ఏడాది కాలంగా కరోనా గమనాన్ని సునిశితంగా అధ్యయనం చేసింది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలిచ్చిన నివేదిక ఆధారంగా ఐరాస ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.

2019 నవంబర్ నెలలో చైనాలోని వూహన్ నగరంలో ఓ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ విస్తృతి మొదలైన సంగతి తెలిసిందే. చైనా ఈ వైరస్ గురించిన వివరాలను రహస్యంగా వుంచడంతో రెండు, మూడు నెలలకు మిగిలిన ప్రపంచానికి కరోనా వైరస్ గురించిన విషయాలు వెల్లడి కాలేదు. ఈలోగా చైనాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకున్నా.. మిగిలిన ప్రపంచ దేశాల మీదికి కరోనా వైరస్‌ పాకిపోయింది. ఇందులో భాగంగా జనవరి 31, 2020న భారత్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మరోవైపు చైనాతో రకరకాల వ్యాపార, వాణిజ్య, ఆయుధ తయారీ రంగంలో ఒప్పందాలు కలిగిన దేశాలకు కరోనా వైరస్ వేగంగా విస్తరించింది. ఈ కోవలోకి జర్మలీ లాంటి పెద్ద దేశం కూడా వస్తుంది. చైనా-జర్మనీల మధ్య టెక్నాలజీ బదిలీతోపాటు నిఫుణుల ఎక్స్చేంజ్ వంటి రంగాల్లో ఒప్పందాలున్నాయి. ముఖ్యంగా జర్మనీలోని ఉత్తర భాగంలో పలు కంపెనీల్లో వేలాది మంది చైనీయులు పని చేస్తుంటారు. వీరంతా జనవరిలో తమ దేశానికి వెళ్ళి తిరిగి వస్తూ కరోనాని మోసుకురావడంతో జర్మనీలో కరోనా విపరీతంగా ప్రబలింది.

మరోవైపు అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ విస్తృతితో విలవిలలాడిపోయింది. అగ్రరాజ్యం తప్పకుండా కరోనాని అదుపు చేస్తుందని భావించిన వాళ్ళంతా డొనాల్డ్ ట్రంప్ వైఫల్యం కారణంగా లక్షలాది మంది కరోనాకు బలవుతుంటే ఆశ్చర్యపోతూ చూడాల్సి వచ్చింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అమెరికా అగ్రరాజ్యం అయినప్పటికీ.. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో చాలా సమయం తీసుకుంది. దాంతో వైరస్ విస్తృతిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ లాంటి విధానాలను అమెరికా కఠినంగా అమలు చేయలేకపోయింది. స్వేచ్ఛా జీవులు అధికంగా వుండే అమెరికాలో లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి నిబంధనలు ఏ మాత్రం ఉపయోగపడలేదు. చావనైనా ఛస్తాం కానీ నిర్భంధం వద్దంటూ వేలాది మంది అమెరికన్లు రోడ్డెక్కారు. దాంతో లాక్ డౌన్ నిబంధనలను గట్టిగా అమలు పరచలేకపోయింది అమెరికా ప్రభుత్వం. ఫలితంగా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం.. అయిదున్నర లక్షల మందికి పైగా కరోనా సోకి మరణించడం జరిగింది అగ్రరాజ్యంలో.

ఇటు మనదేశంలో గత సంవత్సరం మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమలై.. జూన్ తర్వాత సడలింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మనదేశంలో సెప్టెంబర్ నెలలో కరోనా కేసుల సంఖ్య పీక్ లెవెల్‌కు చేరింది. ఆ తర్వాత క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ నుంచి మన దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ.. ప్రజల్లో అవగాహనా రాహిత్యం, కరోనా నిబంధనలను పెద్దగా ఖాతరు చేయకపోవడంతో ఫిబ్రవరి చివరి వారం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. ఇందుకు మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు దేశానికి శాపంగా మారాయి. మార్చి 17వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 35 వేల 886 కొత్త కరోనా కేసులు నమోదు అయితే అందులో మహారాష్ట్రలో నమోదైన కేసులే 64 శాతంగా వున్నాయి. మహారాష్ట్రలో ఒక రోజు వ్యవధిలో 23 వేల 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

పరిస్థితి ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సంకేతాలిచ్చారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలకు పంపిన కరోనా వ్యాక్సిన్లలో పది శాతం వృధా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు కరోనా కేసుల విషయంలో ప్రభుత్వాల ఉదాసీనతను తెలంగాణ హైకోర్టు ఎత్తి చూపింది. కొన్ని ఘాటైన కామెంట్లు చేసింది. రద్దీ ప్రాంతాల్లో కరోనీ పరీక్షలు పెంచాలని, యాంటిజెన్ టెస్టులు కాకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దానికి తోడు పాఠశాల్లోనే కేసులు అధికంగా కనిపిస్తుండడంతో ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రస్తుత విద్యాసంవత్సరానికి తరగతులు వద్దన్న సూచనలు వినిపిస్తున్నాయి. వీటిపై తెలంగాణ ప్రభుత్వం నేడో రేపో ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వుంది. ఫంక్షన్లలో గ్యాదరింగ్స్‌పై మళ్ళీ ఆంక్షలు పెట్టే సంకేతాలున్నాయి.

పరిస్థితి ఇలా ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఐక్య రాజ్య సమితి నివేదిక రావడంతో ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా వుండాల్సిన పరిస్థితి తలెత్తింది. శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఐక్య రాజ్య సమితి నిపుణుల బృందం వెల్లడించింది. శీతకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కరోనా వైరస్ సీజనల్ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు కరోనా వైరస్ వ్యాప్తి వాతావరణ అంశాల కంటే ప్రభుత్వం విధించే నిబంధల ద్వారానే ఎక్కువగా ప్రభావితమైంది. మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ప్రభుత్వ చర్యలు కరోనా వ్యాప్తిని దాదాపుగా కట్టడి చేస్తున్నాయి. అందువల్ల వాతావరణ అంశాల ఆధారంగా మాత్రమే ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించలేవని నిపుణుల బృందం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణంలో కూడా ఈ మహమ్మారి విజృంభించిందని, రాబోయే సంవత్సరంలో ఇలాగే జరగదు అని చెప్పడానికి ఆధారాలు లేవని తెలిపింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించామంది. వైరస్ ప్రసారంపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు వాయు కాలుష్యం మరణాల రేటు పెంపునకు దోహదం చేస్తుందని, వైరస్ ప్రసారంపై మాత్రం నేరుగా ప్రభావం చూపదని కొన్ని అధ్యయనాలు ప్రాథమికంగా వెల్లడిచేస్తున్నాయి.

ఐక్యరాజ్య సమితి తాజా హెచ్చరికలను పలు దేశాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. మరికొన్ని దేశాలు పెద్దగా ఖాతరు చేయడం లేదు. ఊపిరి తిత్తులకు సంబంధించినంత వరకు కరోనా వైరస్ ఎప్పటికీ ప్రాణాంతకమేనని తాజా నివేదికలు చెబుతున్నాయి. దాంతో కరోనా వ్యాక్సిన్లను వైరస్ రూపాంతరానికి అనుగుణంగా కరోనా వ్యాక్సిన్లను అప్ డేట్ చేసుకుంటూ వెళ్ళాల్సిందేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైరస్ రూపాంతరాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌పై నిరంతరం ప్రయోగాలు కొనసాగాల్సిందేనని సూచిస్తున్నారు.

ALSO READ: ఆయుధాల తయారీలో దూకుడు మీదున్న భారత్.. దిగుమతులు తగ్గి.. లోకల్ మేకింగ్ మెరుగుదల

ALSO READ: అమరావతి భూకేటాయింపులు ఆసక్తికరం.. రేట్లలో వ్యత్యాసంపైనే అందరి ద‌ృష్టి.. తేడాలెందుకని ప్రశ్న

ALSO READ: ఆసక్తి రేపుతున్న తిరుపతి బై-ఎలక్షన్.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు.. ఇక ప్రచార సంరంభం