కరీంనగర్ జిల్లా కేంద్రం, నగరంలో అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది. నగరంలో హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించారు.. బుధవారం ఒక్క రోజే కరీంనగర్‌లో ఏడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్ సగం పట్టణాన్ని నిర్భందించింది.. ఆ ప్రాంతంలో విద్యా, వ్యాపార, రవాణా వ్యవస్థలను బంద్ చేసింది. 100 వైద్య బృందాలను రంగంలోకి దింపింది. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు చేస్తున్నారు.. ప్రజలు సైతం స్వచ్ఛందంగా కరోనా పరీక్షలకు ముందుకు వస్తున్నారు. ఇళ్లలోనుంచి ఏ ఒక్కరు బయటకు రావద్దని కలెక్టర్, నగర కమిషనర్ ఇప్పటికే ప్రజలకు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. జనం ఎవరూ బయటకు రావొద్దని, 4 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ముందు జాగ్రత్తగా హోటళ్లు, దుకాణాలు మూసివేశారు.
కరోనా సోకిన ఇండోనేషియా నుంచి వచ్చిన ఏడుగురు మత ప్రచారకులు కరీంనగర్ పట్టణంలో పలు ప్రదేశాల్లో సంచరించారు. 8 మందితో సన్నిహితంగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. అనుమానితులను క్వారంటైన్ లో ఉంచారు. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఆరు కేసులు ఒక్క కరీంనగర్ లోనే నమోదయ్యాయి.. కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే. ఇండోనేషియా నుంచి వచ్చిన ఇస్లామిక్ ప్రచారకుల్లో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కలెక్టర్ శశాంక, నగర సీపీ, వైద్య ఉన్నతాధికారులతో అత్యవసర రివ్యూ నిర్వహించారు.
ఇండోనేషియా నుంచి 11మంది ఇస్లామిక్ మత ప్రచారకులు ఢిల్లీ వచ్చారు. మార్చి 14న ఢిల్లీ నుంచి రైలులో(సంపర్క్ క్రాంతి-ఎస్9 బోగీలో) రామగుండం చేరుకున్నారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో మార్చి 15న కరీంనగర్ వచ్చారు. నగరంలో 48 గంటల పాటు గడిపారు. నగరంలోని వేరు వేరు ప్రాంతాల్లోని మూడు ప్రార్థనా మందిరాలకు వెళ్లారు. మత ప్రచారంలో భాగంగా నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లి పలువురు స్థానికులను కలిశారని అధికారులు తెలిపారు. వారికి కరోనా సోకిందని తేలడంతో కరీంనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు.
కరోనా బాధితులు ప్రయాణించిన రైలు బోగిలోని ఇతర ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు. ఎస్9 బోగీలో 82మంది ప్రయాణించినట్టు అధికారులు తెలుసుకున్నారు. వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని అధికారులు సూచించారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండటం మంచిదన్నారు. మరోవైపు కరీంనగర్ లో కరోనా బాధితులను కలిసిన 13మందిని గుర్తించిన అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా, ఎస్9 బోగీలో ప్రయాణించిన వారు ఎవరు? వారు ఎక్కడ ఉన్నారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అనే ప్రశ్నలు అందరిని హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13కు చేరింది.
తెలంగాణాలో పాజిటివ్ కేసులు పెరగడంతో సర్కార్ అప్రమత్తం అయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ – కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు హుటాహుటిన వెళ్లారు. కరోనాను ఎదుర్కోవడంపై వైద్యులు, అధికారులతో చర్చించారు. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి మంత్రి ఈటల రాజేందర్ – పలు సూచనలు చేశారు.