ఓ వైపు కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పని పరిస్థితులలో లాక్‌డౌన్, కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కోవిడ్ భూతం కోరలు చాస్తోంది. ఛాన్స్ దొరికితే చాలు..ఎదురైన వారిపై ఎటాక్ చేస్తోంది. ఇటువంటి తరుణంలో ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట చోటు చేసుకున్న సంఘటన అందరిని షాక్‌కు గురి చేసింది. అక్కడి అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడతున్నారు. వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎట్టావా జిల్లాలోని సాయ్ ఫాయ్ లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ ఏకంగా 69 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రి బయట గంట పాటు నిలుచున్న ఘటన కలకలం రేపుతోంది. వైద్యులు – వైద్య సిబ్బంది తమను అడ్మిట్ చేసుకోకపోవడంతో 69 మంది కరోనా రోగులు ఉత్తరప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి గేట్ల వద్ద పడిగాపులు కాసిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. ఆసుపత్రి వెలుపల ఉన్న ఫుట్ పాత్ పై కనీసం ఒక గంట పాటు వారంతా వేచి చూసిన వైనం అధికారుల నిర్లక్షానికి అద్దం పడుతోందంటూ స్థానికులతో పాటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
కరోనా సోకిన 69 మందిని ఆగ్రా నుంచి ఓ బస్సులో ఎస్కార్ట్ టీంతోపాటు సాయ్ ఫాయ్ లోని యూపీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. ఆసుపత్రి గేటు వద్ద ఆ 69 మంది రోగులు కేవలం మొహానికి మాస్క్ మాత్రమే ధరించి పడిగాపులు కాశారు. ప్రొటెక్టివ్ గేర్స్ ధరించిన ఇద్దరు పోలీసులు కొంచెం దూరం నుంచి వారిని నియంత్రిస్తూ కనిపించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలలసులు అక్కడకు చేరుకుని..పరిస్థితి సమీక్షించారు. జరిగిన దానిపై విచారించగా… ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే… ఇలా జరిగిందని యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీసీ తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని సరైన డాక్యుమెంట్లు లేనప్పటికీ అందరినీ అడ్మిట్ చేసుకున్నామని ఒక గంట ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ఆ గంట సమయంలో కరోనా పాజిటివ్ పేషెంట్లు బయట ఉండడం…అక్కడ జనసంచారం జరగడంపై విమర్శలు వస్తున్నాయి.